15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

Published : Sep 09, 2025, 07:28 PM IST

CP Radhakrishnan : 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సీపీ రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా NDA ప్రకటించింది. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ. సుదర్శన్ రెడ్డి పై విజయం సాధించి భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

PREV
16
15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 768 మంది ఎంపీలు ఓటేశారు. రాధాకృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.

2025లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారతదేశానికి 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలిచిన సీపీ రాధాకృష్ణన్ భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతి అయ్యారు. సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అయితే, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు ముందుగానే నిర్వహించారు. 1987 తర్వాత ఇలా ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

26
సీపీ రాధాకృష్ణన్ ప్రారంభ జీవితం, రాజకీయ ప్రస్థానం

సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan). ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూరులో జన్మించారు. ఆయన 1974లో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పుడు టీనేజర్‌గా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ సమయంలో, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి సన్నిహిత సహాయకుడిగా మారారు. ఇది ఆయన రాజకీయ కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.

సీపీ రాధాకృష్ణన్ V.O. చిదంబరం కళాశాల, తూత్తుకుడి నుండి BBA డిగ్రీ పూర్తిచేశారు. క్రీడలు, సామాజిక సేవల్లో చురుకుగా ఉంటారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యుడిగా కూడా ఉన్నారు.

36
సీపీ రాధాకృష్ణన్ పార్లమెంటు ప్రస్థానం

1998లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎన్నికై తమిళనాడులో బీజేపీ తరఫున గెలిచిన అరుదైన ముగ్గురు ఎంపీలలో ఒకరుగా నిలిచారు. 1999లో కూడా ఘన విజయంతో మరోసారి గెలిచి 2004 వరకు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు. ఈ కాలంలో ఆయన ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. వాటిలో..

• టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

• ఫైనాన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.

• 2003, 2004లో భారత పార్లమెంటు ప్రతినిధి బృందంతో కలిసి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.

46
తమిళనాడు రాష్ట్ర బీజేపీని నడిపించిన సీపీ రాధాకృష్ణన్

2004 నుండి 2007 వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ రాధాకృష్ణన్ పనిచేశారు. ఈ సమయంలో ఆయన 19,000 కి.మీ. పొడవైన, 93 రోజుల “రథయాత్ర” నిర్వహించారు. ఈ యాత్రలో సామాజిక, పర్యావరణ, జాతీయ ఐక్యత అంశాలను ప్రోత్సహించారు. పార్టీ బలపడేందుకు ఆయన పలు సంస్కరణలు చేపట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ పునాదులను బలోపేతం చేశారు.

సీపీ రాధాకృష్ణన్ పరిపాలనా బాధ్యతలు

2016 నుండి 2020 వరకు కోయిర్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలంలో భారత కోయిర్ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. 2020 నుండి 2022 వరకు బీజేపీ ఆల్‌ఇండియా ఇన్‌చార్జ్‌గా కేరళలో బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో పార్టీ విస్తరణకు కృషి చేశారు.

56
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్ పదవులు

2023 ఫిబ్రవరి 18న ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని 24 జిల్లాలను స్వయంగా సందర్శించి ప్రజలతో, అధికారులతో నేరుగా మాట్లాడారు. 2024 మార్చిలో తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలను అదనపు బాధ్యతగా స్వీకరించారు. అనంతరం 2024 జూలై 31న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

66
ఏన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం

2025 ఆగస్టులో ఏన్డీయే ఆయనను భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ అవకాశం లభించింది. ఆయనకు ఉన్న క్లీన్ ప్రజా ఇమేజ్, అన్ని పార్టీలతో సాన్నిహిత్యంతో బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి పై విజయం సాధించి భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్ నాలుగు దశాబ్దాలుగా భారతీయ రాజకీయాల్లో విశిష్ట పాత్ర పోషించారు. లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర బీజేపీ నాయకుడిగా, గవర్నర్‌గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories