
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) నుండి భారీ గుడ్‌న్యూస్ ! పీఎఫ్ అంటే ఇప్పటివరకు రిటైర్మెంట్ సేఫ్టీ ! కానీ ఇప్పుడు అది లైఫ్ సేఫ్టీ పాలసీగా మారింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న కొత్త నిర్ణయాలతో ఉద్యోగులు ఎలాంటి బీమా ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా పొందుతారు.
తమ 237వ సమావేశంలో ఈపీఎఫ్ఓ దీనిపై నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు రూ.2.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా లభిస్తోంది. ఈ బీమా ప్రయోజనం కోసం ఉద్యోగి నుండి ఎటువంటి అదనపు చెల్లింపు అవసరం లేదు. ఈ నిబంధనలు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (Employee Deposit Linked Insurance - EDLI) స్కీం కింద అమల్లోకి వస్తాయి.
ఈడీఎల్ఐ స్కీం 1976లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యోగి సేవలో ఉన్నప్పుడే అనుకోకుండా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశం.
ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయాలతో డెత్ క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభంగా మారింది. అలాగే బీమా పరిమితి పెంచి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించారు.
ఇప్పటివరకు, ఉద్యోగి మొదటి ఏడాదిలోనే మరణిస్తే కుటుంబానికి బీమా ప్రయోజనం దక్కేది కాదు. కొత్త నిబంధనల ప్రకారం, అలాంటి సందర్భాల్లో కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందుతుంది.
అలాగే, ఉద్యోగం మార్చుకునే సమయంలో రెండు నెలల గ్యాప్ ఉన్నా బీమా కవరేజ్ కొనసాగుతుంది. దీని వల్ల ఉద్యోగి కుటుంబం ఎటువంటి ప్రమాదంలోలో చిక్కుకున్నా బీమా రక్షణ కల్పిస్తుంది.
ఈడీఎల్ఐ స్కీం ప్రకారం.. ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకు లేదా నామినీకి రూ.2.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. ఈ మొత్తం ఉద్యోగి గత 12 నెలల సగటు జీతం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఉద్యోగి నుండి ఎటువంటి ప్రీమియం వసూలు చేయరు. ఉద్యోగదారులు ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 0.5% భాగం ఈడీఎల్ఐ స్కీంకు చెల్లించాలి. నెలకు గరిష్టంగా రూ.75 వరకు మాత్రమే ఈ చెల్లింపు ఉంటుంది.
ఈ స్కీం ద్వారా అనుకోని ప్రమాదం జరిగి సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు సహాయం అందుతుంది. దీని వల్ల సామాజిక భద్రత వ్యవస్థ మరింత బలపడుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి.
ఉద్యోగి సేవలో ఉన్నప్పుడే మరణిస్తే, అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు Form 5IF దరఖాస్తు చేసుకోవాలి. దీనితో పాటు మరణ ధృవపత్రం, నామినీ గుర్తింపు పత్రం, ఇతర అవసరమైన పత్రాలు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాలి.
ఇది పూర్తిగా ఉచితంగా అందించే బీమా కవరేజ్. ఉద్యోగులు దాని కోసం ఎటువంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత లభిస్తోంది.
ఈపీఎఫ్ఓ ఇప్పుడు పెన్షనర్లకు మరింత సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, EPS-95 పెన్షనర్లు ఇకపై తమ ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించవచ్చు.
ఈ సేవ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కూడా ఇంటివద్దనే డీఎల్సీ ధృవీకరణ సౌకర్యం అందుతుంది. ప్రతి లైఫ్ సర్టిఫికేట్‌కు అయ్యే ₹50 సేవా ఛార్జీని ఈపీఎఫ్ఓ భరిస్తుంది.
ఈ కొత్త విధానం వల్ల పెన్షన్ చెల్లింపులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి, అలాగే వృద్ధులు లేదా ఆరోగ్య సమస్యలతో బయటకు వెళ్లలేని పెన్షనర్లకు పెద్ద ఊరట లభిస్తుంది.
ఈ డోర్‌స్టెప్ సర్వీస్‌తో సీనియర్ సిటిజన్లు బ్యాంకులు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే సులభంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించగలుగుతారు. ఈపీఎఫ్ఓ ఈ సేవను దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.