
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో పీఎఫ్ సభ్యులకు డబ్బు ఉపసంహరణ నిబంధనలను మరింత సులభతరం చేశారు. విశ్వాస్ స్కీమ్ ను కూడా తీసుకొచ్చారు. డిజిటల్ మార్పు ప్రణాళికలో భాగంగా EPFO 3.0 ఆమోదించారు.
ఇప్పటి వరకు అకౌంట్ల నుంచి అమౌంట్ ను తీసుకోవడానికి ఉన్న 13 నిబంధనలను సీబీటీ మూడు విభాగాలుగా మార్చింది. ఈ సమయంలో పూర్తి డబ్బును తీసుకోవచ్చు. అవి..
1. అత్యవసర అవసరాలు (విద్య, అనారోగ్యం, వివాహం)
2. ఇంటి అవసరాలు
3. ప్రత్యేక పరిస్థితులు
ఈ మార్పుతో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా కలిపి 100% వరకు డబ్బు తీసుకోవచ్చు. అంతకుముందు విద్య, వివాహం కోసం కలిపి మూడు సార్లు మాత్రమే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు డబ్బును తీసుకోవచ్చు. కనీస సేవా కాలాన్ని కూడా 12 నెలలకు తగ్గించారు. ఈ నిర్ణయాలతో 7 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
సభ్యుల రిటైర్మెంట్ భద్రత దృష్ట్యా, పీఎఫ్ ఖాతాలో కనీసం 25% మొత్తాన్ని నిల్వగా ఉంచడం తప్పనిసరి. ఈ నిల్వపై 8.25% వార్షిక వడ్డీ అందించనున్నారు. ఈ కొత్త నిబంధనలతో అన్ని విత్ డ్రాలు 100% ఆటో సెటిల్మెంట్ విధానంలో జరుగుతాయి. దీని వల్ల పేపర్ వర్క్ తగ్గి సభ్యులకు ఇబ్బందులు వుండవని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈపీఎఫ్ఓ కీలక మార్పుల్లో మరో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే విశ్వాస్ స్కీమ్. ఇది ఆలస్యంగా పీఎఫ్ డిపాజిట్లు చేసిన సంస్థలపై విధించిన పెనాల్టీ కేసులను పరిష్కరించడానికి రూపొందించిన ప్రత్యేక పథకం. మే 2025 నాటికి ఈపీఎఫ్ఓ వద్ద ₹2,406 కోట్ల విలువైన పెనాల్టీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. “విశ్వాస్ స్కీమ్”లో పెనాల్టీ రేటు ప్రతి నెలకు 1 శాతంగా, రెండు నెలల వరకు ఆలస్యానికి 0.25%, నాలుగు నెలల వరకు 0.50%గా నిర్ణయించారు.
ఈ పథకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది, మరో ఆరు నెలలు పొడిగించవచ్చు. స్కీమ్ కింద అన్ని పెండింగ్ కేసులు పరిష్కరించిన వెంటనే స్వయంచాలకంగా రద్దు అవుతాయి. ఈ నిర్ణయం వల్ల లీగల్ కేసులు తగ్గి, నియమాల అమలు ఖర్చు తగ్గి, ఉద్యోగుల బకాయిలు త్వరగా రికవరీ అవుతాయని కార్మిక శాఖ తెలిపింది.
ఈపీఎఫ్ఓ బోర్డు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఈపీఎస్-95 పెన్షనర్లకు ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సేవ అందించనుంది. ప్రతి సర్టిఫికేట్‌కు రూ.50 చెల్లిస్తారు. ఈ మొత్తం ఈపీఎఫ్ఓ భరించనుంది. దీని ద్వారా గ్రామీణ, దూర ప్రాంతాల వృద్ధులు బ్యాంకులకు వెళ్లకుండానే తమ జీవన ధృవీకరణ చేయించుకోవచ్చు. దీని వలన పెన్షన్ చెల్లింపులు నిరంతరంగా సాగుతాయి.
EPFO 3.0 కోసం సంస్థను కోర్ బ్యాంకింగ్ మోడల్లోకి తీసుకురావడానికి సమగ్ర డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించారు. ఇందులో క్లౌడ్ ఆధారిత సేవలు, ఏపీఐ మాడ్యూల్స్, బహుభాషా స్వీయ సేవా ఫీచర్లు ఉండనున్నాయి.
కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ సిస్టమ్స్‌లో..
• రిటర్న్ ఫైలింగ్ మాడ్యూల్: యజమానుల ఫైలింగ్ సులభతరం చేయడానికి తీసుకొచ్చారు
• యూజర్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్ : భద్రతా మెరుగుదల కోసం తీసుకొచ్చారు
• ఈ-ఆఫీస్ సిస్టమ్ 7.0 : వేగవంతమైన ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఈ సేవలు ప్రారంభించారు
• SPARROW : ఆన్‌లైన్ పనితీరు మూల్యాంకన వ్యవస్థ ఇది
ఈ సంస్కరణలు ఈపీఎఫ్ఓలో పారదర్శకత, ఆటోమేషన్ తో పాటు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను అందించడాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.