
Karnataka Betting Case : కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన ఇవాళ(శనివారం) చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర 'పప్పీ'ని సిక్కింలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. చిత్రదుర్గ ఎమ్మెల్యేపై అక్రమ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుంచి గోవా క్యాసినోలు, దుబాయ్ వ్యాపారాల వరకు ఈ వ్యవహారం విస్తరించి ఉంది.
కన్నడ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర తన సహచరులతో కలిసి సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‌టక్ కు క్యాసినో లీజుకు సంబంధించిన చర్చల కోసం వెళ్ళారు. ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం అందింది... అక్రమ ఆర్థిక లావాదేవీలు, బ్లాక్ మనీ మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈడీ అధికారులు ఎమ్మెల్యేతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
ఈడి అధికారులు ఆగస్టు 23న గాంగ్‌టక్‌లో వీరేంద్ర పప్పీని అరెస్టు చేసి సిక్కిం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. అనంతరం బెంగళూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు... ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
ఎమ్మెల్యే అరెస్ట్‌కు ముందు అంటే ఆగస్ట్ 22, 23 తేదీల్లో దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. కర్ణాటక, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ, హుబ్బళి... మహరాష్ట్ర రాజధాని ముంబై... రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈడీ తనిఖీలు జరిగాయి.
ఇలా దేశవ్యాప్తంగా 31 చోట్ల ఈడీ జరిపిన దాడులు దాదాపు రూ. 12 కోట్ల నగదు, రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు లభించాయి. అలాగు 17 బ్యాంక్ ఖాతాలు, రెండు లాకర్లను కూడా ఈడీ గుర్తించింది. వీటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.
చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర వ్యాపారాలు క్యాసినోలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వరకు విస్తరించి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోవాలోని పప్పీస్ క్యాసినో గోల్డ్, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ రివర్స్ క్యాసినో, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోలపై దాడులు జరిగాయి. కింగ్567, రాజా567, పప్పీస్003, రత్న గేమింగ్ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా వీరేంద్ర నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీరేంద్ర సోదరుడు కె.సి. తిప్పేస్వామి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్ట్‌టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ అనే మూడు కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌కు సంబంధించినవని అనుమానిస్తున్నారు.
నగదు, బంగారం, క్యాసినో లింకులతో పాటు వీరేంద్ర విలాసవంతమైన జీవనశైలిపై కూడా ఈడీ దృష్టి సారించింది. చిత్రదుర్గలోని అతని కార్ల కలెక్షన్, అంతర్జాతీయ క్యాసినో మెంబర్‌షిప్ కార్డులు, హై-లిమిట్ క్రెడిట్, డెబిట్ కార్డులు, 5-స్టార్ హోటల్ మెంబర్‌షిప్ కార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిలో ఎంజిఎం క్యాసినో, మెట్రోపాలిటన్ క్యాసినో, బెల్లాజియో క్యాసినో, మెరీనా క్యాసినో, క్యాసినో జ్యువెల్ సభ్యత్వ కార్డులు ఉన్నాయి. అలాగే తాజ్, హయత్, లీలా వంటి ప్రతిష్టాత్మక హోటళ్లకు లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు కూడా అతడివద్ద ఉన్నాయి.
వీరేంద్రను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అతడి ఆదాయం, ఆస్తులతో పాటు విదేశీ లింకులు, రాజకీయ సంబంధాలను పరిశీలిస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు భయటపడే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే బెట్టింగ్ వ్యవహారం, అరెస్ట్ కర్ణాటక కాంగ్రెస్ లోనూ కలకలం రేపింది... మరి ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.