Donald Trump Tariffs
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. వివిధ దేశాలపై ప్రతీకార పన్నులు విధిస్తామని రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవెంటనే ప్రకటించిన ట్రంప్ దాన్ని అమలుచేసారు. దాదాపు 60 దేశాలపై పన్నులు పెంపు నిర్ణయాన్ని అమలుచేస్తున్నారు. ఇలా అమెరికా టారీఫ్స్ పెంచిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. అయితే ట్రంప్ నిర్ణయం భారత్ కు నష్టం కాదు లాభం చేస్తుందని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచితే ఇండియాకు ఎలాంటి లాభమో తెలుసుకుందాం.
Donald Trump Tariffs
ట్రంప్ పన్నులు పెంచినా భారత్ కు లాభమే :
అమెరికా ఎగుమతిచేసే వస్తువులపై ఆయా దేశాలు ఎలాంటి పన్నులు విధిస్తోందో ఇకపై తాముకూడా ఆ దేశాలనుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అదేస్థాయిలో పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అంటే వాణిజ్యపరంగా ఏ దేశం తమతో ఎలా వ్యవహరిస్తుందో తాము కూడా అలాగే వ్యవహరిస్తామన్నది ట్రంప్ వాదన. ఇలా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ప్రతీకార సుంకాలను వడ్డించడం ప్రారంభించారు ట్రంప్.
తాజాగా భారత్ తో సహా వివిధ దేశాల వస్తువులపై ట్రంప్ పన్నులు పెంచారు. ఇలా భారత ఉత్పత్తులపై 27 శాతం సుంకం విధించారు. అత్యధికంగా చైనాపై 54 శాతం టారీఫ్ విధించారు. ఇక వియత్నాం 46, థాయిలాండ్ 36, బంగ్లాదేశ్ 37 శాతం టారీప్ విధించింది. అయితే మనకు ప్రధాన పోటీదారు చైనాపై అత్యధిక టారీఫ్ విధించడం భారత్ కు కలిసివచ్చే విషయం.
ముఖ్యంగా అమెరికా పన్నుల పెంపు భారతీయ వస్త్ర పరిశ్రమకు అద్భుత అవకాశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో భారత్ నుండి దిగుమతయ్యే టెక్స్ టైల్ వస్తువులకు చైనా, బంగ్లాదేశ్ నుండి గట్టిపోటీ ఉంది. అయితే ఇప్పుడు ఆ దేశాలపై భారత్ కంటే అధికంగా పన్నులు వేయనుంది ట్రంప్ సర్కార్... కాబట్టి ఆ వస్త్రాలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో భారతీయ టెక్స్ టైల్స్ కు గిరాకీ పెరగనుంది... తద్వారా మన టెక్స్ టైల్ రంగం మరింత అభివ్రుద్ది చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఫార్మా రంగంపై కూడా అమెరికా టారీఫ్స్ ప్రభావం పెద్దగా ఉండదని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై పన్నుల భారం వేయలేదు... దీంతో భారత ఫార్మా రంగానికి ఊరట లభించింది. అమెరికాలో ఉపయోగించే చాలా మందులు భారత్ నుండి వెళ్లేవే... చాలా చౌకగా నాణ్యమైన మెడిసిన్స్ లభిస్తుండటంతో అమెరికన్లు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రంప్ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు మేలు చేసేలా ఉంది.
ఇండియాలో ఇప్పుడిప్పుడే సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ వేగం పుంజుకుంది. అమెరికాకు థాయిలాండ్, వియత్నాం, తైవాన్ నుండి ఈ సెమి కండక్టర్లు ఎక్కువగా వెళుతుంటాయి... అధిక సుంకాల కారణంగా వీటి ధరలు పెరగనున్నారు. అయితే భారత సెమీ కండక్టర్ల ధరలు తక్కువగా ఉండటంవల్ల వీటికి గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత్ సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచితే మంచి లాభాలను పొందవచ్చు.
Raghuram Rajan
ట్రంప్ టారీఫ్స్ ఎఫెక్ట్ భారత్ పై ఉండదు : ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై పన్నులు పెంచడంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. ఇది భారత్ పై ప్రభావం చూపకపోవడమే కాదు అమెరికాకే రివర్స్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. అమెరికా పన్నుల పెంపు నిర్ణయంపై భారత్ అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఆర్బిఐ గవర్నర్.
''అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దేశాలపై ప్రభావం పడుతుంది. కానీ ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇది ఇండియాకు ఒక ఛాన్స్ లాగా కూడా మారొచ్చు. ఎందుకంటే ప్రపంచ పెట్టుబడులు స్థిరంగా ఉండే మార్కెట్ల వైపు చూస్తాయి. ప్రస్తుతం ఇండియా అలాంటి మార్కెట్లలో ఒకటి'' అని మాజీ ఆర్బిఐ గవర్నర్ రఘురామ రాజన్ పేర్కొన్నారు.
పన్నుల పెంపు అమెరికాకు లాభం చేస్తుందని నూతన అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటున్నట్లున్నాడు... కానీ ఇది వాళ్లకి నష్టం చేసే నిర్ణయమని రఘురామ రాజన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిర్ణయం అమెరికాకు ఒక సెల్ఫ్ గోల్ లాంటిది... దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది భారత ఆర్థికరంగ నిపుణులు రఘురామ రాజన్ తెలిపారు.