
Operation Sindoor : భారత పార్లమెంట్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన 'ఆపరేషన్ సింధూర్' పై వాడివేడి చర్చ సాగింది. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ఎలా ధ్వంసం చేసింది? ఇందుకోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించింది? అనేది రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. అయితే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం పాకిస్థాన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి... ఇందుకు ప్రతీకారంగా ఉగ్రమూకల ఏరివేతకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్... ఇండియా - పాకిస్థాన్ మధ్య యుద్దవాతావరణం తదితర అంశాలపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ (మంగళవారం) రాహుల్ గాంధీ మాట్లాడుతూ... సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు.
సున్నితమైన ఆపరేషన్ వివరాలను వెంటనే పాకిస్థాన్ కు తెలియజేయడం ద్వారా ఆ దేశానికి గట్టిగా సమాధానం ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు రాహుల్. అర్ధరాత్రి 1.05 గంటలకు ఆపరేషన్ సింధూర్ చేపట్టి 1.35 కు పాకిస్థాన్ ఫోన్ చేసినట్లు స్వయంగా రక్షణమంత్రి తెలిపారు... దీన్నిబట్టే ఆ దేశంలో యుద్దం చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారన్నారు. బలమైన రాజకీయ సంకల్ప లేకపోవడంవల్లే ఇలా చేసారని... సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇవ్వాల్సిందన్నారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ 1971 యుద్దంతో ఆపరేషన్ సింధూర్ ను పోల్చడాన్ని రాహుల్ ఖండించారు. ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధికి రాజకీయ సంకల్పం ఉందని... అందుకే ఆమె ఎవరికీ భయపడకుండా యుద్దం కొనసాగించారని రాహుల్ అన్నారు. ఏడవ నౌకాదళం భారత్‌వైపు వస్తున్నా అప్పటి ప్రధాని బంగ్లాదేశ్ కోసం ఏం చేయాలో చేయమని ఆర్మీకి ఆదేశాలిచ్చారని అన్నారు. ఆర్మీ జనరల్ మాణిక్ షా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. 6 నెలలు కాదు సంవత్సరమైనా తీసుకోమన్నారు... దీని ఫలితమే లక్ష మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు.. కొత్త దేశం ఏర్పడింది... ఇదీ రాజకీయ సంకల్పమంటే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇలా 1971 లో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో భారత్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ కు అండగా నిలిచిన భారత్ పై పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ సమయంలోనే ప్రధాని ఇందిరాగాంధీ చాలా ధైర్యంగా వ్యవహరించారని తాజాగా రాహుల్ చెప్పుకొచ్చారు. కానీ ఆ సమయంలో ఆమె భయపడిపోతూ అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశారట. ఈ లేఖ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. దీంతో రాహుల్ గాంధీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
'1971 మార్చి 25న ప్రారంభమైన తూర్పు బెంగాల్ లోపల చోటు చేసుకున్న దురదృష్టకరమైన, అసహనానికి గురిచేసే పరిణామాల గురించి భారత ప్రభుత్వం మీకు, మీ దేశ ప్రజలను నిరంతరంగా సమాచారం ఇస్తూ వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల గురించి దౌత్య ప్రతినిధుల ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వస్తున్నాము. పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు బెంగాల్‌లో అనుసరించిన దమనకాండ క్రూరంగా, వలస పాలన తరహాలో ఉంది. ఇది చివరికి ఘోరమైన హత్యాకాండ (genocide), దారుణ హింసకు దారి తీసింది. దీని ఫలితంగా దాదాపు కోటి మంది తూర్పు బెంగాల్ పౌరులు భారత్ కు శరణార్థులుగా వచ్చారు... వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది'' అని అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు ఇందిరా గాంధీ ఓ లేఖ ద్వారా వివరించారు.
''ఈ ఘోరమైన పరిణామాలను మేము భరించాల్సి వచ్చింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఏ దేశమైనా ఎదుర్కోవలసిన అత్యధిక ఒత్తిడిని మేము ఎదుర్కొన్నాం. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నా మేము ఎంతో ఓర్పుతో ప్రతిస్పందించాం. ప్రపంచానికి నిజాలను వివరించేందుకు మేము తీసుకున్న చర్యలు, ఐక్యరాజ్య సమితిలో మా ప్రయత్నాలు, నా మంత్రివర్గ సహచరులు చేసిన విదేశీ పర్యటనలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తూర్పు బెంగాల్ ప్రజలుగా ఎన్నికైన నాయకులతో పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ చర్చలు జరిపి సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొంటారన్న మా ఆశ నెరవేరలేదు'' అని ఇందిరా గాంధి పేర్కొన్నారు.
''డిసెంబర్ 3, 1971 మధ్యాహ్నం పాకిస్తాన్ భారత్‌పై పెద్దఎత్తున దాడిని ప్రారంభించిన నిర్ధారణాత్మక ఆధారాలు మా చేతికి వచ్చాయి. అధ్యక్షుడు యాహ్యా ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం, పశ్చిమ సరిహద్దుల గుండా భారత్‌పై దాడి చేయమని ఆదేశించింది. తర్వాత రోజు ఉదయం డిసెంబర్ 4న పాకిస్తాన్ ప్రభుత్వం యుద్ధ పరిస్థితి ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేసింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం 5:30 (IST) ప్రాంతంలో పాకిస్తాన్ వాయుసేన భారత్‌పై దాడి చేసింది. శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, అంబాలా, అగ్రా, జోధ్‌పూర్, అవంతిపూర్ వంటి నగరాలపై విమానాల ద్వారా బాంబులు వేసింది. అంతేకాకుండా అంబాలా, ఫిరోజ్‌పూర్, ఖేమ్కరన్, పూంఛ్, మెహదీపూర్, జైసల్మేర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి అని సరిగ్గా 3 నుంచి 6 గంటల సమయంలో సరిహద్దులంతటా దాడులు జరిపిన విధానం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది'' అన్నారు.
''పాకిస్తాన్ అధ్యక్షుడు నవంబర్ 25న “పది రోజుల్లో యుద్ధానికి సిద్ధమవుతాను” అని చెప్పారు... దీన్నిబట్టి ఈ దాడికి ముందే ప్లాన్ చేసారని అర్థమవుతుంది. నేను స్వయంగా కోల్‌కతాలో ఉన్న సమయంలో, ఇతర సీనియర్ మంత్రులు దేశం నలుమూలల ఉన్న సమయంలో పాకిస్తాన్ ఈ దాడిని ప్రారంభించడం గమనించదగ్గ విషయం. దీనికి తోడు దాడి ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ ప్రసార మాధ్యమాలు భారత్‌పై తప్పుడు ఆరోపణలతో ప్రచారం మొదలుపెట్టాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఇది నాలుగవసారి (1947, 1948,1965 తర్వాత) పాకిస్తాన్ భారత్‌పై దాడికి పాల్పడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు బెంగాల్ దమన విధానాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు, సమస్యను అంతర్జాతీయీకరించేందుకు ఈ దాడికి పాల్పడిందన్నది మాకు స్పష్టంగా తెలుసు'' అని పేర్కొన్నారు.
''ఇది నా దేశానికి అత్యంత ప్రమాదకరమైన సమయం. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయాలన్న పాకిస్తాన్ సైనిక యంత్రాంగం నేరుగా భారత్‌పైకి దూసుకొచ్చింది. మా భద్రతను, భౌగోళిక సమగ్రతను కాపాడటం బాధ్యతగా మారింది. అందుకే మేము దేశాన్ని యుద్ధసన్నద్ధ స్థితిలోకి తీసుకువచ్చాము. దేశ రక్షణ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. ఈ దాడికి కలిగే ఫలితాలన్నింటికీ బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే అవుతుంది. మేము శాంతిని కోరే ప్రజలం, కానీ శాంతి రక్షించాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ పోరాటం కేవలం భూభాగాన్ని కాపాడేందుకు కాదు భారతదేశ భవిష్యత్తును కాపాడేందుకు జరుగుతోంది. ఈ ప్రమాద సమయంలో మేము మీ మద్దతును కోరుతున్నాం. మీరు కలుగజేసుకుని పాకిస్తాన్ ను దాని యుద్ధప్రవర్తన నిలిపివేయమని కోరుతున్నాం. తూర్పు బెంగాల్ సమస్య మూలంగా ఈ అశాంతి ఏర్పడింది... దానిని పరిష్కరించేందుకు మీరు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒప్పించగలరని మేము ఆశిస్తున్నాం'' అని ఇందిరాగాంధి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కోరారు.
1971 యుద్ద పరిస్థితుల్లో ఇందిరా గాంధీ ధైర్యంగా వ్యవహరించారంటున్నారు రాహుల్ గాంధీ... కానీ అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ చూస్తే శరణు కోరినట్లుగా ఉందంటున్నారు నెటిజన్లు. తన నాన్నమ్మ గురించి గొప్పలు చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఓసారి ఈ లేఖను చూడాలని... ఇదేనా 'రాజకీయ సంకల్పం' అంటూ ఎద్దేవా చేస్తున్నారు.