Published : Jul 29, 2025, 04:34 PM ISTUpdated : Jul 29, 2025, 04:58 PM IST
వయనాడ్ ప్రకృతి విపత్తుకు ఏడాది పూర్తవుతోంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఏకంగా రెండు గ్రామాలు మాయమైపోయాయి 300 మందికిపైగా మరణించారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో, అక్కడి పరిస్థితులేంటి తెలుసుకుందాం.
గతేడాది సరిగ్గా ఈ రోజు(జులై 29) కేరళలోని వయనాడ్ ప్రాంతం ప్రశాంతంగానే ఉంది. రాత్రి అక్కడి ప్రజలు ఎప్పటిలాగే పడుకున్నారు… కానీ తెల్లారేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది… చాలామంది నిద్ర లేవలేదు. జులై 30 తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి… దీంతో 300 మందివరకు మరణించారు…32 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం వీరిని మృతులుగా ప్రకటించింది. బాధితుల కుటుంబాలకు మరణ ధృవపత్రాలు అందజేశారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు, బంధువుల్ని కోల్పోయినవారు ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు.
DID YOU KNOW ?
వయనాడ్ విపత్తు మానవ తప్పిదమే
వయనాడ్ లో గతేడాది సరిగ్గా ఇదే సమయంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదమే కారణమని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ (WWA) వెల్లడించింది. జులై 30, 2024 న వయనాడ్ లో 140మి.మీ వర్షపాతం నమోదయ్యిందని... ఇది చాలాప్రాంతాల్లో వార్షిక వర్షపాతానికి సమానమని తెలిపింది.
28
కొండరాళ్లను తోసుకుంటూ దూసుకొచ్చిన వరదనీరు
2024 జూలై 30న వనరాణి ఎస్టేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. వరద నీరు చెట్లు, బండరాళ్లతో పుంజిరిమట్టం వైపు ప్రవహించింది. పుంజిరిమట్టం ఒక పెద్ద ఆనకట్టలా మారింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో బండరాళ్లు, చెట్లు కొట్టుకుపోయాయి… వరదనీరు కొండప్రాంతంలోని మట్టితోకలిసి బురదగా మారి పుంజిరిమట్టం, ముండక్కై ప్రాంతాలపై విరుచుకుపడింది… దీంతో ఆర్తనాదాలు మిన్నంటాయి.
38
ఒకేరోజు రెండుసార్లు ప్రళయం
ఒక్కసారిగా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. విషాదం అక్కడితో ఆగలేదు. సీతమ్మకుండ్ అనే చిన్న జలపాతం వైపు వరదనీరు పోటెత్తింది.. రాత్రి పది గంటలకు మళ్ళీ ప్రళయం సంభవించింది. దీంతో మొదటిసారి ప్రమాదంలో మిగిలిన ఇళ్లు కూడా ఈసారి నాశనం అయ్యాయి. ఆ విషాదం తీవ్రత ఎంత ఉందో బయటి ప్రపంచానికి తెలియదు. చీకట్లో పరుగెత్తుకొచ్చిన వారంతా నిస్సహాయంగా నిలిచిపోయారు. ఫోన్‌లో సహాయం కోరిన వారిని కూడా తర్వాత సంప్రదించలేకపోయారు.
ఉదయం 5.45 గంటలకు వెలుతురు వచ్చేసరికి అక్కడి దృశ్యం చూసి అందరూ భయపడ్డారు. బురదలో కూరుకుపోయి ప్రాణభయంతో అరుస్తున్న ప్రజలు కనిపించారు. వందలాది మృతదేహాలు బురదలో కప్పబడి ఉన్నాయి. 48 గంటల్లో 572 మి.మీ. వర్షం కురిసిందని అంచనా. ఈ ప్రకృతి విపత్తును గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో వైఫల్యం జరిగింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు.
58
ఇప్పటికి వయనాడ్ బాధితులకు మానసిక సమస్యలు
ముండక్కై, చూరల్‌మల ప్రకృతి విపత్తు నుండి బతికిబయటపడిన స్థానికులు ఇప్పటికీ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్ మూప్పెన్స్ మెడికల్ కాలేజీ వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. బాధితులే కాదు, రెస్క్యూ సిబ్బంది కూడా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వారు తెలిపారు. వీరిలో చాలా మందికి దీర్ఘకాల చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.
68
కేంద్రం సాయమేది..
వయనాడ్ ప్రకృతి విపత్తుకు ఏడాది నిండినా బాధితుల బ్యాంకు రుణాలు మాఫీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల్లో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. కేరళ బ్యాంక్ ఇప్పటికే రుణాలు మాఫీ చేసింది. కానీ జాతీయ బ్యాంకులు రుణాలు మాఫీ చేస్తేనే బాధితులకు ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
78
ఇంకా కోలుకోని గ్రామాలు
ప్రకృతి విపత్తుకు మృత్యు లోయగా మారిన ముండక్కైలో ఏడాది గడిచినా ఆ నిశ్శబ్దం ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రమాదం నుండి బతికిబయటపడిన వారంతా అక్కడినుండి వెళ్లిపోవడంతో జనసంచారం చాలా తక్కువగా ఉంది.
88
ప్రస్తుతం వయనాడ్ ఎలా ఉందంటే...
అన్నీ కోల్పోయిన వారిని ఆదుకుంటూ దేశప్రజలు మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. నిరాశ్రయులైన వారికి సాయం చేయడానికి ప్రజలు ముందుకొచ్చారు. వయనాడ్ బాధితులకు మద్దతుగా నిలిచింది ఏసియా నెట్.
వయనాడ్ విషాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏసియా నెట్ ప్రతినిధులు వయనాడ్ ను సందర్శించారు. హడావిడి చేయడానికో, ఆర్భాటం చేయడానికో కాదు… ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉందో లోతుగా పరిశీలించడానికి. సంవత్సరం తర్వాత అక్కడ ఏం మిగిలిందో తెలుసుకోవడానికి.