Delhi EV Policy: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం EV Policy 2.0కు ఆమోదం తెలిపింది.
2028 నుంచి కొత్త పెట్రోల్ బైక్‌లకు రిజిస్ట్రేషన్ లేదు
కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్‌లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్‌జీ ఆటోరిక్షాలకు కూడా కొత్త రిజిస్ట్రేషన్లు ఉండవు. ఆ తేదీల తర్వాత కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకే అనుమతి ఉంటుంది. అయితే ఇప్పటికే రోడ్డుపై ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనసాగించి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నిబంధనలు కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకే వర్తిస్తాయి.
25
ఈవీ కొనుగోలుదారులకు భారీ రాయితీలు
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీలను ప్రకటించింది. తొలి ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే రూ.30,000 ప్రోత్సాహకం. రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 సబ్సిడీ అందిస్తారు. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు తొలి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు జీవితకాల రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించారు. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
35
చార్జింగ్ స్టేషన్లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలకు భారీ నిధులు
ఈవీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రూ.7 వేల కోట్లను ఈవీ కొనుగోలుదారులకు సబ్సిడీలుగా అందించనుంది. రూ.8 వేల కోట్లతో ఢిల్లీ అంతటా సుమారు 30 వేల కొత్త చార్జింగ్ పాయింట్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనుంది. అదనంగా, బీఎస్-4 లేదా అంతకంటే పాత వాహనాలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ ప్రోత్సాహకం కూడా ఇవ్వనున్నారు.
కొత్త ఈవీ పాలసీ ప్రభావం స్టాక్ మార్కెట్‌లో కూడా స్పష్టంగా కనిపించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల షేర్లకు భారీగా కొనుగోళ్లు వచ్చాయి. ఏథర్ ఎనర్జీ షేరు ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా లాభాలతో ముగిసింది. గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ షేరు విలువ గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా రోజులో దాదాపు 11 శాతం వరకు ఎగిశాయి. చివరకు బలమైన లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. మరోవైపు సంప్రదాయ పెట్రోల్ బైక్‌ల తయారీ సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ షేరు రోజంతా ఒత్తిడిలో ట్రేడై నష్టాలతో ముగిసింది.
55
కాలుష్య నియంత్రణే ప్రధాన లక్ష్యం
ఢిల్లీలో నమోదవుతున్న వాయు కాలుష్యంలో సుమారు 23 శాతం వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల వల్లే ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచాలని నిర్ణయించింది. 2020లో ప్రవేశపెట్టిన తొలి ఈవీ పాలసీకి కొనసాగింపుగా ఇప్పుడు తీసుకొచ్చిన EV Policy 2.0 ద్వారా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, చార్జింగ్ మౌలిక వసతులు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు వంటి చర్యలతో ఢిల్లీని 2030 నాటికి దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల నగరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.