BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బిసిలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 'కులగణన' చేపట్టిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని చూస్తోంది.. ఇప్పటికే బిసిలకు 29 నుండి 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాదు అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం లభించాల్సిఉంది.
ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆర్డినెన్స్ ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపింది. కానీ దీనికి తెలంగాణ గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ పై క్లారిటీ కోసమే స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది... కాబట్టి వెంటనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ ఇవాళ(మంగళవారం) పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇక ఇప్పటికే ప్రత్యేక రైలులో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీగా డిల్లీకి చేరుకుంటున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు... ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా డిల్లీకి చేరుకుంటున్నారు. ఇక గురవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు.
ఇలా బిసి రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన దేశప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఏ రాష్ట్రంలో బిసిలకు ఎంత రిజర్వేషన్ ఉందనే చర్చ మొదలయ్యింది. కాబట్టి దేశవ్యాప్తంగా బిసిలకు అందుతున్న రిజర్వేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.