Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 12, 2026, 12:55 PM IST

Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాని మోదీ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశరాజధాని ఢిల్లీని జైలుగా మార్చేసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఇండియా కూటమి సుప్రీంకోర్టు వైపు మార్చ్‌కు సిద్ధమైందనీ, ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

PREV
16
ఢిల్లీలో ఉద్రిక్తత.. సీఈసీ రాజీనామా కోసం విపక్షాల పోరు

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు చేపడుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ రాజధానిని కేంద్ర ప్రభుత్వం ఒక జైలుగా మార్చేసిందని, ప్రజలు ఢిల్లీకి రాకుండా బస్సులు, రైళ్లను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రక్షిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ముంబైలోని దాదర్, శివాజీ పార్క్ సమీపంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన పలువురు ఆందోళనకారులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

26
మోదీ ప్రభుత్వం సీఈసీని కాపాడుతోంది: రాహుల్ గాంధీ

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "మేము కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నాం. కానీ ఢిల్లీ నగరాన్ని ఎందుకు బంధించారు? సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కాపాడేందుకు ప్రభుత్వం సుమారు 30,000 మంది పోలీసులను మోహరించింది. ఇది ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు. జ్ఞానేష్ కుమార్‌ను ప్రభుత్వం ఎలా కాపాడుతుందో దేశ ప్రజలందరికీ చూపించాలనుకుంటున్నాం. ఎంత రక్షించినా చివరికి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు హ్యాండ్లర్ వద్దకే మేము వెళ్తాం" అని వ్యాఖ్యానించారు.

అలాగే ప్రభుత్వం వద్ద పనిచేస్తున్న 200 మందికి పైగా అధికారులు తమతో నిరంతరం టచ్‌లో ఉన్నారని, నిమిషానికో సమాచారం ఇస్తున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరిగే వరకు, ఎలక్షన్ సిస్టమ్‌లో మార్పులు వచ్చే వరకు తమ పోరాటం ఆగేదే లేదని స్పష్టం చేశారు.

36
పోలీసులకు కూడా అనుమానాలు ఉన్నాయి

పోలీసు బలగాల మోహరింపుపై స్పందిస్తూ, "పోలీసులు కూడా ఈ పరిస్థితితో విసిగిపోయారు. ఒక దొంగను, దేశద్రోహులను తాము ఎందుకు కాపాడుతున్నామో అని వారి మనస్సులోనే సందేహాలు వస్తున్నాయి. పోలీసు శాఖలో ఉన్న 50 శాతం మంది సిబ్బంది విపక్షాలు చేస్తున్న పోరాటం సరైనదే అని అంగీకరిస్తున్నారు" అని రాహుల్ పేర్కొన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ వాళ్లు మహిళలను, యువకులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన విమర్శించారు.

గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కు వెళ్తే పోలీసులు తమను బస్సుల్లో పడేసి జంతర్ మంతర్ వద్దకు పంపారని, అక్కడ కూర్చుంటే లాఠీఛార్జ్ చేశారని, రాజ్‌ఘాట్ వద్ద కూడా కొట్టారని రాహుల్ గుర్తుచేశారు. ఈ భయాందోళనలకు లొంగిపోయేది లేదని, ఎంత సమయం పట్టినా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

46
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భేటీ నిరాకరణ

ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వైపు మార్చ్ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలందరినీ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఖర్గే కలిసి సీజేఐ జస్టిస్ సూర్య కాంత్‌ను కలవడానికి సమయం కోరారు. అయితే, ప్రొటెస్ట్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు విచారణలో ఉన్నందున, అలాగే పాలనాపరమైన అంశాల్లో కోర్టు నేరుగా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ సీజేఐ ఈ భేటీని నిరాకరించారు.

దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, సీజేఐ సూచనల మేరకు తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు.

56
నా పరిధిలోని అంశం కాదు: సీజేఐ సూర్య కాంత్

ఢిల్లీలో జరుగుతున్న సీఈసీ నిరసనలు, ట్రాఫిక్ ఆంక్షలు, 45 మెట్రో స్టేషన్ల మూసివేతపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) 33వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, "యే మేరా ముద్దా నహీ హై" (ఇది నా పరిధిలోని అంశం కాదు) అని వ్యాఖ్యానించారు. శాంతియుత నిరసనలు, ప్రజల హక్కులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఢిల్లీ కంటోన్మెంట్‌గా మారిన సంగతి తెలిసిందే.

66
దేశవ్యాప్తంగా నిరసనల తీవ్రత

గతంలో అక్టోబర్ 10న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల సమయంలోనే ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. అప్పట్లో సిజెపి నాయకులు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానం దిగగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి 'చలో ఢిల్లీ మార్చ్ ఫర్ డెమోక్రసీ' పిలుపునివ్వడంతో రాజధాని సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేశారు. సీఈసీ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగేది లేదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories