
భారతదేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొంతమంది వ్యాపారవేత్తలు కేవలం తమ ఆవిష్కరణలతోనే కాకుండా, వారి ఆలోచన, నాయకత్వం, స్ఫూర్తిదాయకమైన ప్రయాణంతో ప్రత్యేకంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు Ankit Mehta, ideaForge సహ వ్యవస్థాపకులు, CEO. ఐఐటీ బాంబేలో విద్యార్థిగా ప్రారంభమైన అంకిత్ ప్రయాణం, నేడు భారత సాయుధ దళాలకు కీలకమైన డ్రోన్లను తయారు చేసే స్థాయికి చేరింది. ఈ అనుభవాలను ఆయన ‘Mic’d Up With India’s Defencepreneurs’ మొదటి ఎపిసోడ్‌లో పంచుకున్నారు. అదిత్ చార్లీ (Asianet News Digital కంటెంట్ హెడ్) హోస్ట్ చేసిన ఈ సంభాషణలో అంకిత్ పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
26/11 ఘటన తర్వాతే డ్రోన్‌లను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందన్న అంకిత్ మొహతా.. ఆ టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో ఉంటే మరింత సహాయం అయ్యేదేమో అని అభిప్రాయపడ్డారు. ఏదైనా సంక్షోభం కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. నిజమైన వ్యాపారవేత్తలు మార్కెట్లోని లోటుపాట్లను అవకాశాలుగా మార్చుకుంటారని సందేశాన్ని ఇచ్చారు అంకిత్.
మొదట హ్యాండ్ క్రాంక్ ఛార్జర్లు తయారు చేశామని, ఆఫ్-గ్రిడ్‌లో మొబైల్ ఫోన్లు వాడుకునేందుకు రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ప్రయాణం చిన్నదిగా మొదలవుతుందని, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం, బలమైన పునాది నిర్మించడం ముఖ్యమనే సందేశాన్ని ఇచ్చారు.
“మా టెక్నాలజీ -30°లో, ధూళి, వర్షం, ఉప్పు వాతావరణంలో కూడా పనిచేయగలగాలి.” అని అంకిత్ చెప్పుకొచ్చారు. మనం తయారు చేసే ఉత్పత్తులు అన్ని పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఉండాలి. దీర్ఘకాలిక విజయానికి దృఢత అవసరమని ఆయన అన్నారు.
తమ వాదనలు ఎవరి అభిప్రాయం గెలుస్తుందని చెప్పడానికి కాదని, వ్యాపారానికి సరైనదే చేయాలనే దానిపై ఉంటాయని అంకిత్ అన్నారు. అంటే వ్యక్తిగత అహంకారం కంటే సంస్థ విజయమే ముఖ్యం. విభేదాలు సరైన నిర్ణయాలకు దారి తీస్తాయనేది ఆయన అభిప్రాయం.
“టీమ్ ఎప్పుడూ బిజినెస్ ఫలితాన్ని ముందు ఉంచితే, తేడా అభిప్రాయాలు ఉన్నా సరైన నిర్ణయానికి చేరతారు.” అని అంకిత్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే విజన్ పట్ల ఐక్యతే విజయానికి మూలం. వ్యక్తిగత గెలుపు కంటే సంస్థ మిషన్ ప్రధానమైందనేది ఆయన అభిప్రాయం.
“సూపీరియారిటీ అంటే కేవలం పోటీ కాదు, కొత్త టెక్నాలజీ సృష్టించడమే.” అనేది అంకిత్ భావన. అంటే కేవలం పోటీ చేయడం కాదు, పరిశ్రమనే కొత్త దిశలో నడిపించాలని చెప్పుకొచ్చారు.
“జీవితాలను రక్షించగలగడం లేదా కష్టసమయంలో సహాయం చేయగలగడం… అదే పెద్ద ఆనందం.” అని అంకిత్ అభిప్రాయపడ్డారు. అర్థవంతమైన ఫలితాలు తాత్కాలిక లాభాల కంటే విలువైనవి. నిజమైన సమస్యలను పరిష్కరించడం గొప్ప విజయమనేది ఆయన భావన.
“భారతదేశం లాంటి క్లిష్ట పరిస్థితులకు తయారు చేసే టెక్నాలజీని ప్రపంచానికి ఉపయోగించవచ్చు.” అనేది అంకిత్ మెహతా అభిప్రాయం. స్థానిక సవాళ్లు ప్రపంచ మార్కెట్లో మీ బలం అవుతాయనే బిజినెస్ పాఠాన్ని చెప్పారు అంకిత్.
“నా సహ వ్యవస్థాపకులందరూ తమతమ రంగంలో సూపర్‌స్టార్స్. విభిన్న దృక్కోణాలు మమ్మల్ని మెరుగైన పరిష్కారాలకు నడిపించాయి.” అని అంకిత్ తెలిపారు. అంటే విభిన్న ప్రతిభలు, దృక్కోణాలు కలిసి వస్తేనే నిజమైన ఆవిష్కరణలు జరుగుతాయనేది ఆయన అభిప్రాయం.
“మేము నిర్మించేది ప్రపంచంలో మొదటిది కావాలి లేదా ప్రపంచంలో అత్యుత్తమం కావాలి. లేకపోతే మార్కెట్లో మిగతావారితో కలిసిపోతాం.” అని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన వ్యాపారంలో విజయం సాధించాలంటే.. గుంపును అనుసరించడం కాదు, ప్రత్యేకతను సృష్టించడం ముఖ్యం. స్థిరమైన వ్యాపారం కొత్త కేటగిరీని సృష్టించడం లేదా గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలవడం ద్వారానే సాధ్యమవుతుందనే సందేశాన్ని ఇచ్చారు.
అంకిత్ మెహతా పంచుకున్న అనుభవాలు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. విజయం సాధించడానికి విజన్, పట్టుదల, టీమ్‌వర్క్, ప్రభావం సృష్టించే ఆవిష్కరణలు అవసరం. ఆయన చెప్పిన ఈ పాఠాలు ప్రతి స్టార్టప్ వ్యవస్థాపకుడికి ప్రేరణ మాత్రమే కాదు, ఆచరణలో పెట్టదగిన మార్గదర్శకం అని చెప్పాలి.