Anant Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన వివాహంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కేవలం వ్యాపార రంగంతోనే కాకుండా తన మంచి పనులతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా మూగ జీవుల సంరక్షణకు అనంత్ పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. గుజరాత్ జామ్‌నగర్‌లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నిర్మించి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మూగ జీవులపై తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పారు. అనంత్ అంబానీ తాజాగా జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీల పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా గడిచిన 5 రోజులుగా ప్రతీ రోజు రాత్రి 10 నుంచి 12 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 60 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశారు. చుట్టూ భద్రత సిబ్బంది నడుమ అనంత్ తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన తన పుట్టిన రోజుకు ముందు ద్వారాకకు చేరుకోవాలనే లక్ష్యంతో అనంత్ ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే రోడ్డుపై నడుస్తున్న సమయంలో అనంత్ అంబానీని ఓ సంఘటన ఆకర్షించింది. కోళ్లతో వెళ్తున్న ఓ లారీని చూసిన అనంత్ దానిని ఆపాడు. అందులో ఉన్న కోళ్లను గమనించిన అనంత్ తన సిబ్బందికి వాటిని సంరక్షించమని ఆదేశించాడు. కోళ్లను తరలిస్తున్న వ్యాపారికి నష్టం లేకుండా డబ్బులు చెల్లించి వాటిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనంత్ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Anant Ambani's Vantara Foundation
ఇదిలా ఉంంటే ద్వారాకకు పాదయాత్రగా వెళ్తున్న అనంత్ అంబానీ.. మార్గమధ్యంలో ఉన్న దేవాలయాలను సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ మాట్లాడుతూ.. 'ఏదైనా పని ప్రారంభించే ముందు ద్వారకాధీశుడిపై నమ్మకం ఉంచి, ఆయనను స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఇలా చేస్తే మీరు మొదలు పెట్టిన పని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది' అని చెప్పుకొచ్చాడు.