ప్రపంచంలోనే తొలి ఏఐ బేబీ జననం...
సాధారణంగా ఓ ఆడ, మగ శారీరకంగా ఒక్కటయితే పిల్లలు పుడతారు. కానీ వివిధ కారణాల వల్ల పిల్లలులేక బాధపడుతున్న జంటలకు వైద్య పద్దతిలో సంతానం కలిగేలా చేస్తున్నారు. ఇందుకోసమే ప్రతిచోట సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. సాధారణంగా గర్భం దాల్చలేకపోతున్న మహిళలకు వివిధ వైద్య పద్దతుల్లో గర్భం దాల్చేలా చేస్తారు. ఇందుకోసం IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), IUI (ఇంట్రాయుటెరైన్ ఇన్ సెమినేషన్) వంటి అనేక వైద్య పద్దతులు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఏఐ రాకతో ఈ వైద్య పద్దతులు కూడా మారిపోయాయి. సాధారణంగా ఐవిఎఫ్ లో ICSI (intracytoplasmic sperm injection) పద్దతిని ఉపయోగిస్తారు. అంటే ఇది వైద్య నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. మహిళ నుండి అండాన్ని సేకరించి దానిలో వీర్యకణాన్ని ఇంజెక్ట్ చేసేవరకు అంతా మాన్యువల్ గా జరుగుతుంది. 23 దశల్లో జరిగే ఈ కృత్రిమ గర్భధారణ పద్దతిని నిపుణులైన ఎంబ్రియాలజిస్టుల దగ్గరుండి పర్యవేక్షిస్తారు.
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఈ గర్భధారణ పద్దతి పూర్తిగా మారిపోతోంది. వీర్యాన్ని సెలెక్ట్ చేయడం దగ్గరినుండి అండంలోకి దాన్ని ఇంజెక్ట్ చేసేవరకు గల 23 స్టెప్స్ ఏఐ సాయంతో అత్యాధునిక వైద్య పరికరాలే చేస్తున్నాయి. మనిషి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. కేవలం ఇదంతా ఎలా జరుగుతుందో వైద్య నిపుణులు పర్యవేక్షిస్తే చాలు. ఇలా ఏఐ ఆధారిత ఐవిఎఫ్ సిస్టమ్ ద్వారా ఓ మహిళ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శిశువు ఏఐ సాయంతో భూమిపైకి వచ్చిన మొదటి వ్యక్తి.