ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025
పిచ్చుకలు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి. వాటిని రక్షించడానికి మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకొంటారు. గతంలో పిచ్చుకలు ఇళ్ల ముందు, అటకలు, దూలాలు, పైకప్పు సందుల్లో గూళ్లు కట్టుకునేవి. ఈ రోజుల్లో భవనాలు పెద్దవిగా ఉంటున్నాయి, చెట్లు తక్కువగా ఉంటున్నాయి, ఎయిర్ కండిషనింగ్ వంటి సాంకేతికతలు ఇళ్లలో సాధారణమైపోయాయి. మన ఇళ్లు పిచ్చుకలకు కొత్తగా ఉన్నాయి. గతంలో 13 సంవత్సరాలు జీవించిన పిచ్చుకలు ఇప్పుడు 5 సంవత్సరాలలోనే చనిపోతున్నాయి. మానవ సాంకేతిక అభివృద్ధి కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పడంలో సందేహం లేదు.
పిచ్చుకల దినోత్సవం ఎలా మొదలైంది?
గాలి వెళ్లడానికి వీలులేని గట్టిగా మూసివున్న పట్టణ ఇళ్లలో పిచ్చుకలు బతకలేవు. పట్టణ ప్రాంతాల్లో గాజు కిటికీలను ఢీకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. గ్రామాల్లో కూడా ఇళ్లు కాంక్రీటు కావడంతో పిచ్చుకలు తక్కువగా వస్తున్నాయి. పిచ్చుకలు పునరుత్పత్తి చేయడానికి అవసరమైన వాతావరణం లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల్లోనే 60% కంటే ఎక్కువ నాశనమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి, ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2010లో మార్చి 20ని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా మొదలు పెట్దింది.
పెద్దల నమ్మకాలు:
పిచ్చుకలు ఇంటికి రావడం మంచిదని మన పెద్దలు నమ్మేవారు. పిచ్చుకలు వచ్చి ఉండే ఇంట్లో పిల్లలు పుడతారనే నమ్మకం కూడా ఉండేది. కొన్ని నమ్మకాలు మంచి చేస్తాయి. ఇది అలాంటి నమ్మకాల్లో ఇది ఒకటి. వీటితో పర్యావరణానికి అందమే కాదు.. మనం వాటిని తరచూ చూస్తుంటే మనసుకి కూాడా ప్రశాంతంగా ఉంటుంది.
పిచ్చుకలను ఎలా పిలవాలి?
పిచ్చుకలు తోటలోని పొదలు, మొక్కలు, చెట్లలో గూళ్లు కట్టుకుంటాయి. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తున్నాయో లేదో గమనించండి. వస్తుంటే వాటి కోసం ఆహారం ఉంచండి. బియ్యం పిండి, చిన్న చిన్న ధాన్యాలు వాటికోసం ఉంచవచ్చు. వాటి దాహం తీర్చడానికి అవి వచ్చే దిశలో నీళ్లు పెట్టండి. నీటిని తరచుగా మార్చాలి. లేదంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెకు పిచ్చుక వెళ్ళడానికి తగినంత పెద్ద రంధ్రం చేసి ఎత్తుగా వేలాడదీయండి. పిచ్చుకలు అందులో నివాసం ఉండే అవకాశం ఉంది.