Lord Venkateswara: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పూస్తారు?

Published : Sep 24, 2026, 04:29 PM IST

Lord Venkateswara: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గడ్డానికి పచ్చ కర్పూరం పూస్తారు. అలాగే గుడి మహాద్వారం దగ్గర అనంతాళ్వారు గునపం ఉంటుంది. అసలు ఈ రెండింటి వెనుక అసలు కథ ఏమిటి?

PREV
14
శ్రీవారి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు?

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేటప్పుడు భక్తుల దృష్టిని ఆకర్షించేది స్వామి వారి గడ్డానికి ఉండే పచ్చ కర్పూరం. అలాగే గుడి మహాద్వారం దగ్గర ఒక పాత ఇనుప గునపాన్ని కూడా భద్రపరిచారు ఈ రెండింటికీ శ్రీ రామానుజాచార్యుల శిష్యుడైన అనంతాళ్వారు భక్తికి ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన కథ తిరుమలలో తరతరాలుగా వినిపిస్తోంది.

శ్రీవారి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు? ఆ గునపానికి, స్వామివారికి ఉన్న సంబంధం ఏంటి? దీని వెనుక భక్తి, సేవ, కోపం, చివరకు దేవుడిని తెలుసుకున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కథ దాగి ఉంది. ఆ కథను ఇప్పుడు వివరంగా చూద్దాం.

24
అనంతాళ్వారు ఎవరు?

శ్రీవైష్ణవ సంప్రదాయంలో గొప్ప భక్తుడిగా పేరు తెచ్చుకున్న అనంతాళ్వారు, శ్రీ రామానుజాచార్యుల శిష్యుల్లో ఒకరు. తిరుమలలో స్వామివారికి పూల సేవ (పుష్ప కైంకర్యం) చేసిన ఘనత ఆయనదే. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి, తిరుమలలో నందవనం ఏర్పాటు చేసి రోజూ పూల సేవ ఎవరు చేస్తారని రామానుజులు తన శిష్యులను అడిగారు. ఆ బాధ్యతను తీసుకున్న అనంతాళ్వారు, తన భార్యతో కలిసి తిరుమలకు వెళ్లి నందవనం పెంచే పని మొదలుపెట్టారు.

మొక్కలు పెరగాలంటే నీళ్లు కావాలి కాబట్టి, అనంతాళ్వారు ఒక చెరువు తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది తన గురువు అప్పగించిన పని కావడంతో, ఆ పనిని తానూ తన భార్య మాత్రమే చేయాలని ఆయన గట్టిగా అనుకున్నారు.

అనంతాళ్వారు మట్టి తవ్వుతుంటే, నిండు గర్భిణీగా ఉన్న ఆయన భార్య ఆ మట్టిని మోసుకెళ్లి పోసేవారు. ఎవరి సాయం తీసుకోకుండా వాళ్లే ఆ పనిని కష్టపడి చేసేవారు.

34
భక్తుడికి సాయం చేయడానికి వచ్చిన 12 ఏళ్ల బాలుడు

అనంతాళ్వారు దంపతులు పడుతున్న కష్టాన్ని చూసిన శ్రీవారు, వారికి సాయం చేయడానికి 12 ఏళ్ల బాలుడి రూపంలో వచ్చారు. కానీ, ఇది తన గురువు ఇచ్చిన పని అని, తామే చేసుకుంటామని అనంతాళ్వారు ఆ బాలుడి సాయాన్ని వద్దన్నారు.

అయినా ఆ బాలుడు వినకుండా, అనంతాళ్వారు చూడని సమయంలో మట్టి మోయలేక ఇబ్బంది పడుతున్న ఆయన భార్యకు సాయం చేయడం మొదలుపెట్టాడు. తన భక్తుడికి తెలియకుండానే, సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే బాలుడిగా వచ్చి సాయం చేసిన ఈ ఘటనలో ఆ తర్వాత ఊహించని మలుపు చోటుచేసుకుంది.

ఒకానొక సమయంలో ఆ బాలుడు తన భార్యకు సాయం చేయడం అనంతాళ్వారు చూశారు. తాను వద్దన్నా వినకుండా సాయం చేస్తున్నాడనే కోపంతో, చేతిలో ఉన్న ఇనుప గునపాన్ని ఆ బాలుడి వైపు విసిరారు. అది ఆ పిల్లాడి గడ్డానికి తగిలి రక్తం కారడంతో, ఆ బాలుడు అక్కడి నుంచి మాయమయ్యాడు.

44
గుడిలో అనంతాళ్వారుకు ఎదురైన షాక్

ఆ తర్వాత శ్రీవారి దర్శనం కోసం అనంతాళ్వారు గుడికి వెళ్లారు. అక్కడ గర్భగుడిలో మూలవిరాట్టు గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఆయన షాక్ అయ్యారు. అప్పుడే ఆయనకు అసలు నిజం తెలిసింది.

తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే అని ఆయనకు అర్థమైంది. తెలియక స్వామివారినే గునపంతో కొట్టానని బాధపడి ఆయన కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు వేడుకున్నారు.

గాయపడిన స్వామివారి గడ్డానికి అనంతాళ్వారు పచ్చ కర్పూరం రాసి తన బాధను వ్యక్తపరిచారు. ఆయన భక్తిని మెచ్చిన శ్రీవారు, ఆ సంఘటనకు గుర్తుగా తన గడ్డానికి కర్పూరం రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలని వరం ఇచ్చారు.

దానికి గుర్తుగానే ఇవాళ్టికీ తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చ కర్పూరం పెడతారు. ఇది కేవలం అలంకారం కాదు, భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories