ఇండియా టర్మరిక్ సిటీ..
తమిళనాడులోని ఈరోడ్ ప్రపంచ పసుపు రాజధానిగా గుర్తింపు పొందితే, మహారాష్ట్రలోని సాంగ్లీ నగరం టర్మరిక్ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర మొత్తం పసుపు ఉత్పత్తిలో ఒక్క సాంగ్లీ జిల్లాలోనే దాదాపు 70 శాతం పసుపు ఉత్పత్తి అవుతుంది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీనమైన, అతి పెద్ద పసుపు వర్తక కేంద్రాల్లో ఇది ఒకటి కావడం విశేషం.
సాంగ్లీ పసుపు కూడా జీఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. ఇక్కడ లభించే పసుపు చూడటానికి కూడా చాలా అందంగా కనపడుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. 20వ శాతాబ్దం ప్రారంభం నుంచి ఇక్కడ పసుపు వేలం పాట వేస్తూ ఉంటారు.
మన సంస్కృతిలో పసుపు ప్రాధాన్యత...
మన సంస్కృతిలో పసుపు కేవలం వంటింటి మసాలా దినుసు మాత్రమే కాదు. ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణిస్తారు. చర్మ సౌందర్యం పెంచుకోవడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు తగ్గేందుకు పసుపు పాలు కూడా మనకు మంచి ఔషధంలా పని చేస్తాయి. అంతేకాదు.. శుభకార్యాల్లో కీలక పాత్ర పోషించే ఈ పసుపు.. మన ప్రాచీన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం.