Dog Bite: కుక్క కరిచినప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కుక్క కాటు వల్ల కలిగే గాయం కంటే, దానివల్ల వచ్చే రేబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. అందుకే కుక్క కరిచిన వెంటనే ప్రథమచికిత్స చేయాలి. ఆ తరువాత వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
వీధుల్లో కుక్కల సంఖ్య అధికంగానే ఉంది. కొన్ని కుక్కలు దారిపోయే వారికి ఏమీ అనవు కానీ కొన్ని మాత్రం పిల్లలపై తమ ప్రతాపాలు చూపిస్తాయి. కుక్క కాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. కేవలం వీధి కుక్కలే కాదు, శిక్షణ లేని పెంపుడు కుక్కలు కూడా కొన్నిసార్లు దాడి చేస్తాయి. చాలామంది కుక్క కాటును చిన్న గాయంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
24
ఇలాంటి కుక్కలకు దూరంగా..
అన్ని కుక్కలు కరవవు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఉన్న కుక్కలు మాత్రం దాడి చేస్తాయి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న కుక్కలు , ఏదైనా నొప్పితో బాధపడుతున్న కుక్కలు కచ్చితంగా దాడి చేసే అవకాశం ఎక్కువ. అలాంటి కుక్కలు వింతగా కూడా ప్రవర్తిస్తాయి. తల్లి కుక్కల వాటి పిల్లలకు లేదా ఆహారానికి ఆపద వచ్చినప్పుడు కూడా దాడి చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కుక్కల జోలికి వెళ్లకూడదు. ఇక రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు తమ విచక్షణను కోల్పోయి పిచ్చివాటిలా తిరుగుతాయి. తమ బాధను తట్టుకోలేక ఎదురుగా ఎవరున్నా కరిచేందుకు సిద్ధమవుతాయ.
34
కుక్క కరిచిన వెంటనే ఇలా చేయాలి
కుక్క కరిచిన వెంటనే, ఆసుపత్రికి వెళ్లేందుకే ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. కానీ ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఆసుపత్రికి వెళ్లాలి.
ముందుగా కుక్క కరిచిన ప్రాంతాన్ని పారుతున్న నీటి కింద ఉంచి సబ్బుతో సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు కడగాలి. ఇది కుక్క లాలాజలంలోని వైరస్ తీవ్రతను తగ్గిస్తుంది. గాయం నుంచి రక్తం వస్తుంటే, దాన్ని ఆపడానికి శుభ్రమైన గుడ్డతో సున్నితంగా నొక్కి ఉంచండి . మీ దగ్గర అందుబాటులో ఉంటే గాయానికి యాంటీబయాటిక్ క్రీమ్ రాయండి. ఇక గాయంపై దుమ్ము ధూళి పడడం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి వెంటనే దుమ్ము, ధూళి లోపలికి వెళ్లకుండా గాయాన్ని శుభ్రమైన క్లాత్ తో కట్టు కట్టండి.
కుక్క కరిచినప్పుడు సొంత వైద్యం చేసుకుని ఇంట్లోనే ఉండిపోకండి. డాక్టర్ దగ్గరకు వెళ్లడం వల్ల చాలా ముఖ్యం. వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి టెటానస్ ఇంజెక్షన్ ఇస్తారు. కుక్కకు టీకాలు వేశారో లేదో తెలియకపోతే, కాటుకు గురైన వారికి రేబిస్ టీకా తప్పకుండా వేయించుకోవాలి. గాయం లోతుగా ఉంటే కుట్లు వేయాలా వద్దా అని డాక్టర్ నిర్ణయం తీసుకుంటారు.
కుక్క కరిచిన తర్వాత సరైన జాగ్రత్లు తీసుకోకపోతే కొంతమందికి రేబిస్ వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి కొన్ని లక్షణాలను చూపిస్తుంది. గాయం వద్ద తీవ్రమైన ఎరుపు, వాపు లేదా నొప్పి పెరిగిపోతుంది. తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది. వీరు నీటిని చూస్తే భయపడడం మొదలుపెడతారు. వీరికి తీవ్రమైన తలనొప్పి రావడం, గందరగోళంగా అనిపించడం వంటివి జరుగుతాయి.
రేబిస్ వ్యాధికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. కుక్క కరిచిన వెంటనే టీకా వేయించుకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. అయితే వీధి కుక్కల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు వేయించడం మర్చిపోవద్దు.