Curd vs Yogurt: పెరుగుకు, యోగర్ట్‌కు మధ్య తేడా ఏంటి? ఏది ఆరోగ్యానికి మంచిది?

Published : Aug 01, 2026, 08:56 AM IST

Curd vs Yogurt: పెరుగు గురించి అందరికీ తెలిసిందే.. కానీ యోగర్ట్ అంటేనే ఎక్కువ మంది అదేంటో అనుకుంటూ ఉంటారు. అసలు అంతేకాదు పెరుగుకన్నా యోగర్ట్ ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో తెలుసా?

PREV
13
యోగర్ట్ ఎలా తయారవుతుంది?

పెరుగు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. భోజనం చివరలో ఒక పెరుగు ముద్ద తిననిదే సంపూర్ణంగా తిన్నట్టు అనిపించదు. కానీ యోగర్ట్ మాత్రం అందరిళ్లల్లో ఉండదు. దాన్ని కొనుక్కుని తినాలి. పెరుగు, యోగర్ట్.. ఈ రెండూ పాల నుంచి తయారయ్యే ఆహార పదార్థాలే. అయినప్పటికీ వీటి తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. మన ఇళ్లలో రోజూ చేసుకునే పెరుగును పాలల్లో తోడు వేసి సహజంగా పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇందులో సహజంగా లభించే ల్యాక్టోబాసిల్లస్ బాక్టీరియా ఉంటుంది. దీనివల్ల పెరుగు రుచి, చిక్కదనం.. మన చుట్టూ ఉండే వాతావరణం, వేసిన తోడును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఇక యోగర్ట్ మాత్రం ఒక నియయం ప్రకారం తయారవుతుంది. పాలను ప్రత్యేకమైన మంచి బ్యాక్టీరియాతో పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ముందుగా పాలను వేడి చేసి చల్లారనిస్తారు. తర్వాత అందులో కల్చర్ కలిపి కొన్ని గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచుతారు. బ్యాక్టీరియా.. పాలలోని లాక్టోస్‌ను లాక్టిక్ యాసిడ్‌గా మార్చడంతో పాలు చిక్కగా మారి, పుల్లటి రుచితో యోగర్ట్ తయారవుతుంది.

23
దేనిలో పోషకాలు ఎక్కువ

పోషకాల విషయానికి వస్తే రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే యోగర్ట్‌లో ముఖ్యంగా గ్రీక్ యోగర్ట్ లో నీటి శాతాన్ని తగ్గించి తయారుచేస్తారు కాబట్టి సాధారణ పెరుగు కంటే ప్రోటీన్, క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల బలానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా, లాక్టోస్ ఇన్ టాలరెన్స్ (పాలు అరగని సమస్య) ఉన్నవారికి సాధారణ పెరుగు కంటే యోగర్ట్ సులభంగా జీర్ణమవుతుంది. కానీ మన ఇంట్లో చేసుకునే పెరుగులో నీటి శాతం ఎక్కువగా ఉండి, శరీరాన్ని చల్లబరచడానికి, రోజూవారీ జీర్ణక్రియను సులభతరం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

33
ఏది మంచిది?

ప్రతిరోజూ మన భోజనంతో పాటు తినడానికి, శరీరంలో వేడిని తగ్గించి జీర్ణశక్తిని పెంపొందించడానికి ఇంటి పెరుగు మంచిది. వ్యాయామాలు చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా శరీరానికి ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునేవారు యోగర్ట్‌ను ఎంచుకోవడం మంచిది. అయితే మార్కెట్లో దొరికే రకరకాల ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉత్పత్తులలో పంచదార, రసాయనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తీపి లేని ప్లెయిన్ యోగర్ట్ లేదా మన ఇంటి పెరుగును మాత్రమే రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories