
జుట్టుకు నూనె చాలా అవసరం. నూనె వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. వెంట్రుకలు బలంగా ఉంటాయి. హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు పొడిబారవు. వారానికి రెండుమూడు సార్లు జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొంతమంది రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టుకుని ఉదయం స్నానం చేస్తుంటారు. కానీ ఇలా రాత్రంతా జుట్టుకు నూనె ఉండటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పొడిబారడం తగ్గుతుంది
చాలా మంది వెంట్రుకలు డ్రైగా ఉంటాయి. ఈ డ్రైనెస్ వల్ల వెంట్రుకలు ఊడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. మీరు గనుక రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే జుట్టు పొడిబారే అవకాశం తగ్గుతుంది. నూనె జుట్టుకు అవసరమైన తేమనను అందిస్తుంది. అలాగే జుట్టు తెగిపోవడాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టుకుని పడుకోవడం వల్ల జుట్టు మూలాలకు కూడా నూనె చేరుతుంది. దీంతో జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఇది కూడా డీప్ కండీషనింగే. దీనివల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అలాగే జుట్టు సాఫ్ట్ గా, సిల్కీగా అవుతుంది. నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు జుట్టు కుదుళ్లకు అందుతాయి. దీంతో వెంట్రుకలు బలంగా అవుతాయి. వెంట్రుకలు తెగిపోకుండా బలంగా ఉంటాయి.
జుట్టుకు నూనె పెట్టి కాసేపు మసాజ్ చేయడం వల్ల నెత్తిమీద రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రాత్రిళ్లు జుట్టుకు నూనె పెడితే నెత్తి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణ కూడా అందుతుంది. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరుగుతుంది. అలాగే నెత్తి తేమగా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల అంటువ్యాధులు, నెత్తిమీద దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందుకోసం కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నెత్తి సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
చుండ్రు
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాద ంఉంది. ఇలా మీరు ప్రతిరోజూ రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే ఇది నెత్తిమీద బాగా పేరుకుపోతుంది. దీనివల్ల దుమ్ము, ధూళితో నెత్తిమీద మందపాటి పొర ఏర్పడుతుంది. దీనివల్ల నెత్తిమీదున్న రంధ్రాలు మూసుకుపోయి చుండ్రు ఏర్పడుతుంది. ఉన్న చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది. అలాగే వెంట్రుకలు కూడా రాలుతాయి. రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే జుట్టు మరింత మురికి అవుతుంది. దీనిని వదిలించుకోవడానికి షాంపూను ఎక్కువగా పెడితే నెత్తిమీదున్న సహజ నూనెలు తగ్గి నెత్తి పొడిబారుతుంది.
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల లాభాలున్నాయని జుట్టుకు నూనె ఎక్కువగా పెడితే మాత్రం జుట్టు వెయిట్ ఎక్కువ అయ్యి వెంట్రుకలు తెగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అలాగే మీరు మరుసటి రోజు తలస్నానం చేయకపోతే జుట్టు రాలుతుంది కూడా.
జుట్టుకు నూనె ఎప్పుడు పెట్టడం మంచిది?
నిపుణుల ప్రకారం.. జుట్టుకు నూనె పెట్టడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. కానీ రాత్రిపూటే జుట్టుకు నూనె పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు జుట్టుకు నూనె పెట్టొచ్చు. కానీ రెండు మూడు గంటల తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి.