Pumpkin Seeds: గుమ్మడి గింజల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి వీటిలో లభిస్తాయి. ముఖ్యంగా 30 రోజులపాటు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
శరీరానికి అవసరమైన పోషకాలను అందించే పదార్థాల్లో గుమ్మడి గింజలు ముందుంటాయి. ఈ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని స్నాక్‌గా లేదా ఇతర ఆహారాల్లో కలిపి తీసుకునే అలవాటు పెరుగుతోంది. అయితే 30 రోజుల పాటు గుమ్మడి గింజలను తింటే శరీరంలో ఎలాంటి మార్పులు రావచ్చు? వీటిని రోజూ తినడం వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
25
కండరాలు, నరాల పనితీరుకు..
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్‌తో పాటు అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. ముఖ్యంగా మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరు, శక్తి ఉత్పత్తి వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
జింక్ రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు, గాయాలు మానడానికి అవసరం. కాబట్టి గుమ్మడి గింజలను సమతుల్యమైన ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి.
35
అతిగా తినాలనే కోరిక తగ్గడం
30 రోజుల పాటు గుమ్మడి గింజలను పరిమిత మోతాదులో తీసుకుంటే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పెరుగుతాయి. ఈ పోషకాల కలయిక వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో మధ్య మధ్యలో స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. అయితే గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మోతాదుకు మించి తినకూడదు.
గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం గుండె, కండరాల పనితీరుకు ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు గుండెకు మేలు జరుగుతుంది. అయితే మెగ్నీషియం లోపం ఉన్నవారు కేవలం గుమ్మడి గింజలపైనే ఆధారపడకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
గుమ్మడి గింజల్లో జింక్ కూడా ఉంటుంది. జింక్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరం. చర్మ ఆరోగ్యం, గాయాలు మానడం వంటి ప్రక్రియల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన మొత్తంలో జింక్ లభించడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
55
గుమ్మడి గింజలు ఎలా తినొచ్చు?
గుమ్మడి గింజలను తినేటప్పుడు వాటి రకం, తయారీ విధానం కూడా ముఖ్యమే. ఎక్కువ ఉప్పు కలిపిన, నూనెలో బాగా వేయించిన గింజల కంటే ఉప్పు తక్కువగా ఉన్న లేదా ఉప్పు లేని గింజలను ఎంచుకోవడం మంచిది. వీటిని రోజూ ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు. నిపుణుల ప్రకారం రోజుకి 20-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. వీటిని స్నాక్‌గా లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి ఆహారాల్లో కలిపి తినవచ్చు.
గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే వాటిలోని కొవ్వు, ఫైబర్ కారణంగా కొందరికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాగే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఆహార నియమాలు పాటించేవారు రోజువారీ డైట్‌లో పెద్ద మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.