Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరిమిత మోతాదులో అవిసె గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే 5 ముఖ్యమైన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో అవిసె గింజలు ఒకటి. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ వీటిలోని పోషకాలు మాత్రం ఎక్కువే. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, లిగ్నాన్లు, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని పరిమిత మోతాదులో రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రతిరోజూ అవిసె గింజలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
26
పేగుల ఆరోగ్యం
అవిసె గింజల్లో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ పేగుల పనితీరు సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. ఉదయం పెరుగు, ఓట్స్ లేదా స్మూతీలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పొడి చేసిన అవిసె గింజలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది. అయితే ఫైబర్ ఎక్కువగా తీసుకునే సమయంలో తగినంత నీరు తాగడం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
36
గుండె ఆరోగ్యానికి మేలు
నిపుణుల ప్రకారం అవిసె గింజల్లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వీటిలో ఉండే ఫైబర్, లిగ్నాన్లు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే అవిసె గింజలు మాత్రమే గుండె సమస్యలను నివారిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వీటిని తీసుకోవడం మంచిది.
అవిసె గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరంగా తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు పరిమిత మోతాదులో అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
56
షుగర్ కంట్రోల్
అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు, ఇతర మందులు వాడుతున్నవారు ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
66
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు
అవిసె గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో, సహజ కాంతినివ్వడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
అయితే అవిసె గింజలను ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. నిపుణుల ప్రకారం లైట్ గా వేయించి పొడి చేసిన అవిసె గింజలను తీసుకుంటే శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహించే అవకాశం ఉంటుంది. వీటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, సలాడ్లు లేదా చపాతీ పిండిలో కలిపి తీసుకోవచ్చు. సాధారణంగా రోజుకు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే చాలు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, వయసు, ఆహారపు అలవాట్లను బట్టి ఈ పరిమాణం మారవచ్చు.