పాము విషం.. ప్రాణాలు కూడా కాపాడుతుందా?
పాము కాటు వేస్తే.. దానిలోని విషం.. నిమిషాల్లో మన ప్రాణాలు తీసేస్తుంది. కానీ, అదే విషం మన ప్రాణాలను కూడా కాపాడుతుందని మీకు తెలుసా? ఏ పాము విషానికి అయితే.. మనం భయపడతామో.. అదే విషం తో లక్షలాది మంది గుండె జబ్బుల రోగులకు, హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి కొండంత అండగా నిలుస్తోంది. మెడికల్ సైన్స్‌లో ప్రాచుర్యం పొందిన కొన్ని బిపి , హార్ట్ ఎటాక్ మందులను పాము విషం నుంచే తయారుచేస్తారు. అల్జీమర్స్, క్యాన్సర్ , స్ట్రోక్ చికిత్సలలో పాము విషంలోని ప్రొటీన్లను వాడేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
పాము పాలు తాగుతుందా?
మన దేశంలో అందరు దేవుళ్లతో పాటు.. పామును కూడా దేవతగా పూజిస్తూ ఉంటాం. పూజలో భాగంగా పాలు పోస్తూ ఉంటారు. కానీ.. సైన్స్ ప్రకారం, పాములు పాలు తాగలేవు. పాములకు లాక్టోస్ జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. పాము పాలు తాగడం మేము కళ్లారా చూశాం అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది. గుడులలో లేదా పండుగల సమయంలో పాములు కొన్నిసార్లు పాలు తాగుతాయి. కానీ అది ఇష్టంతో కాదు... తీవ్రమైన నిర్జలీకరణం, దాహం వల్ల వేరే దారి లేక తాగుతాయి. పాలు తాగడం వల్ల చాలా పాములు అనారోగ్యం పాలై చనిపోతాయి.
అన్ని పాములు ప్రమాదకరమైనవి కావా?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 పైగా పాము జాతులు ఉంటే, అందులో కేవలం 15% నుండి 20% మాత్రమే మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో కనిపించే మెజారిటీ పాములు విషపూరితమైనవి కావు. కాబట్టి, పాములు కనిపించగానే వాటిని చంపకుండా, వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమచారం ఇస్తే సరిపోతుంది.