Weather: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సమయానికి చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అర్జెంటీనాలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 2000 నుంచి 2022 వరకు 156 దేశాల డేటాను విశ్లేషించారు. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రజలు శారీరకంగా చురుకుగా ఉండడం తగ్గిపోతుందని వారు గుర్తించారు. ఈ ఫలితాలు ప్రముఖ వైద్య జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
25
వేడి పెరిగితే వ్యాయామం తగ్గిపోతుంది
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. సగటు ఉష్ణోగ్రత 27.8°C కంటే ఎక్కువగా ఉండే ప్రతి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ యాక్టివిటీ సుమారు 1.5% వరకు తగ్గుతుందని అధ్యయనం చెబుతోంది. తక్కువ, మిడిల్ ఆదాయ దేశాల్లో ఇది మరింత ఎక్కువగా, దాదాపు 1.85% వరకు ఉండొచ్చు. కొన్ని అత్యంత వేడి ప్రాంతాల్లో ఇది 4% వరకు పెరిగే అవకాశం ఉంది.
35
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
వేడి వాతావరణం శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో కదలడం కష్టంగా అనిపిస్తుంది, గుండెపై కూడా ప్రభావం పడుతుంది. దీని వల్ల ప్రజలు వ్యాయామం చేయడం తగ్గిస్తారు. ఫలితంగా గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది కేవలం జీవనశైలి సమస్య మాత్రమే కాదు… దీర్ఘకాలిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీసే అంశం.
ఈ పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రతి ఏడాది 4.7 లక్షల నుంచి 7 లక్షల వరకు అదనపు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అధ్యయనం అంచనా వేసింది. అంతేకాదు, ఉత్పాదకత తగ్గిపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలగవచ్చు.
55
ఏం చేయాలి.?
నిపుణులు వెంటనే పలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ప్రధానంగా.. వేడిని తట్టుకునేలా నగరాల రూపకల్పన చేయాలి. ఇండోర్ వ్యాయామానికి అనుకూలమైన ప్రదేశాలు పెంచాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రపంచం వేడెక్కుతున్న ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక చలనం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.