రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. ఈ సీజన్ లో చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే బయటకు వెళ్లినప్పుడు చలిని తట్టుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. వెచ్చని దుస్తులు ఎక్కువగా ధరిస్తాం. కానీ, చలి ప్రభావం శరీరానికి మాత్రమే కాదు.. మన ఇంటిపై కూడా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంటుంది.
ఇంట్లో బాగా చల్లగా ఉంటే ఎక్కువ మంది రూమ్ హీటర్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ, రూమ్ హీటర్ పెట్టుకుంటే.. కరెంట్ బిల్లు తట్టుకోవడం అంత సులువేమీ కాదు. అంతేకాదు.. హీటర్ ఆరోగ్యానికి కూడా అంత మంచిదేమీ కాదు. అందుకే, రూమ్ హీటర్ కూడా లేకుండా.. ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
చలికాలంలో ఇంటిని వెచ్చగా ఉంచుకోవడం ఎలా?
మందమైన, ముదురు రంగు కర్టెన్లు వేయండి:
మీ ఇంట్లోని కిటికీల నుండి చల్లని గాలి రాకుండా నిరోధించడానికి మందమైన, ముదురు రంగు కర్టెన్లను వేయండి. ఇది చల్లని గాలిని లోపలికి రాకుండా చేస్తుంది, మీ ఇల్లు వెచ్చగా ఉంటుంది.
కార్పెట్లు వాడండి
చలికాలంలో ఇంటి నేల చాలా చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు, నేలపై కార్పెట్లు వేయండి. ఇది మీ పాదాలను చలి నుండి కాపాడుతుంది, మీ ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తుంది.
క్యాండిల్స్..
చలికాలంలో ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి క్యాండిల్స్ మంచి ఎంపిక. క్యాండిల్స్ ఇంటికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, మీ ఇంటికి అందమైన రూపాన్ని కూడా ఇస్తాయి, చలిని తగ్గిస్తాయి.
వేడి నీటి సంచి
చలికాలంలో చేతులు, కాళ్ళు చాలా చల్లగా ఉంటాయి. కాబట్టి మీ పడక అడుగున వేడి నీటి సంచిని ఉంచండి. ఇది నిద్రపోయేటప్పుడు మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.
కిటికీలు తెరవండి!
చలికాలంలో చల్లని గాలి రాకుండా ఉండటానికి ఇంటి కిటికీలను మూసి ఉంచుతాము. కానీ పగటిపూట ఎండ వచ్చేటప్పుడు ఇంటి కిటికీలను తెరిచి ఉంచితే, సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుంది, దీని వలన ఇల్లు వెచ్చగా ఉంటుంది.