
మిగతా కాలాలతో పోల్చితే చలికాలంలోనే ఎన్నో రోగాలు సోకుతుంటాయి. అందులోనూ ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకేముందు దగ్గు, జలుబు, జ్వరం అంటూ సర్వరోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్ లో వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఏవి పడితే అవి తింటే మాత్రం లేనిపోని రోగాలొస్తయ్ అంటున్నారు ఆహార నిపుణులు. జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తింటే దీర్ఘకాలిక మలబద్దకం సమస్య పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద వయసు వారే కాదు యువత కూడా..
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి వంటి మొదలైన వివిధ కారణాల వల్ల మలబద్ధకం వస్తుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక మలబద్దకం కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
మలబద్ధకం ఒక సాధారణ సమస్య. ఇది అన్ని వయస్సుల వారికి, అన్ని లింగాల వారికి వస్తుంది. నిశ్చల జీవనశైలి,చెడు ఆహారపు అలవాట్లున్న చిన్న పిల్లలకు కూడా ఇది వస్తుంది. ఈ రోజుల్లో ఇది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయితే మలబద్ధక ఒక్క చెడు జీవనశైలి వల్లే కాదు.. ఐబిఎస్, డయాబెటిస్, హైపోథైరాయిడిజం, కడుపునకు సంబంధించిన వ్యాధుల వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలం జీర్ణశయాంతర ప్రేగుల గుండా సమర్థవంతంగా వెళ్ళలేనప్పుడు లేదా పురీషనాళం నుంచి బయటకు రానప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో మలం గట్టిగా, పొడిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే మలబద్ధకం లక్షణాలను నిర్ణయించడంలో ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మలబద్దకం సమస్య శీతాకాలంలో మరింత దిగజారుతుంది. అందుకే జీర్ణవ్యవస్థకు ఏది మంచిది? ఏది మంచిది కాదు? అన్న విషయాలను తెలుసుకోవాలి. మలబద్దకం సమస్యను కలిగించే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లను తక్కువగా తాగడం
చలికాలంలో నీళ్లను తక్కువగా తాగే వారు చాలా మందే ఉన్నారు. చలికారణంగా దాహం వేయదు. ఇంకేముంది ఈ కారణంతో చాలా మంది ఒక్క తినే టైంలోనే నీళ్లను తాగుతుంటారు. మిగతా టైంలో నీళ్లు అసలే గుర్తుకు రావు. కానీ మలబద్దకానికి నిర్జలీకరణం కూడా ఒక ముఖ్యమైన కారణమేనంటున్నారు నిపుణులు. ఆల్కహాల్, కెఫిన్ వంటి పానీయాలను క్రమం తప్పకుండా లేదా ఎక్కువగా తాగడం వల్ల కూడా బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది.
ఫైబర్ ను తక్కువగా తీసుకోవడం
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు మంచిది. వైట్ బ్రెడ్, బియ్యం వంటి ఎక్కువగా ప్రాసెస్ చేసిన ధాన్యాలలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వీటివల్ల చాలా మందికి మలబద్దకం సమస్య వస్తుంది.
పండని అరటి పండ్లు
అరటిపండ్లు జీర్ణక్రియకు చాలా మంచివి. కానీ వాటిని పచ్చిగా తీసుకుంటే మాత్రం మలబద్దకం సమస్య వస్తుంది. అరటిపండ్లలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ పండని అరటిపండ్లలో ఈ పిండి పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణం కావడం కష్టం. ఇది మలబద్దకానికి కారణమవుతుంది.
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. కానీ జీర్ణక్రియకు సహాయపడే లాక్టేజ్ అనే ఎంజైమ్ మనలో చాలా తక్కువగా ఉంటుంది. నిజానికి ఇది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. అందుకే పాలు, పాల ఉత్పత్తుల తొందరగా అరగవు. వీటివల్ల కూడా మలబద్దకం సమస్య వస్తుంది.
ఫాస్ట్ ఫుడ్
పిజ్జా, ఐస్ క్రీములు, బర్గర్లు, చిప్స్, బిస్కెట్లతో సహా అనేక ఫాస్ట్ ఫుడ్స్ లో ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు ఫైబర్ కంటెంట్ చాలా అవసరం. కానీ వీటిలో అది ఉండదు. ఫాస్ట్ ఫుడ్స్ మలబద్దకాన్ని కలిగించడమే కాకుండా, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కొవ్వు కాలేయం వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తాయి.