వృద్ధులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి..!

First Published Oct 7, 2022, 1:50 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే ముసలి వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలనే వారికి పెట్టాలి.
 

వృద్ధుల ఆరోగ్యం బాగుండాలన్నా.. వారి ఆయుష్షు పెరగాలన్నా.. వాళ్ల ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. మంచి లైఫ్ స్టైల్ తో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే పెట్టాల్సి ఉంటుది. పేలవమైన జీవనశైలి, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ వృద్ధుల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందులోనూ వృద్ధుల్లో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థను కష్టపెట్టే ఆహారాలను అసలే తినకూడదు. వృద్ధుల ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వృద్ధుల ఆహారంలో రకరకాల కూరగాయలు, చిక్కుళ్ళు, తాజా పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.  ఫైబర్ ఎక్కువ, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలనే పెట్టాలి. రోజంతా నీటిని పుష్కలంగా తాగేట్టు చూడాలి. అలాగే తేలికపాటి వ్యాయామం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గుడ్డు

వృద్ధాప్యంలో శరీరం ప్రోటీన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. కానీ శరీరరం బలంగా ఉండటానికి , కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి నిర్దిష్ట మొత్తంలో ప్రోటీన్ అవసరమవుతుంది. గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వృద్ధుల ఆహారంలో గుడ్లు ఉండేట్టు చూడాలి. వృద్ధాప్యంలో గుడ్లు తినడం వల్ల 13 ముఖ్యమైన పోషకాలు అందుతాయి. 
 

పెరుగు

వృద్ధులు పెరుగును తప్పకుండా తినాలి. ఎందుకంటే పెరుగు ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగులో జీర్ణక్రియకు ఉపయోగడపడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది.
 

బ్రోకలీ

వృద్ధులు బ్రోకలీని ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే బ్రోకలీలో ఉండే పోషకాలు గుండె జబ్బులు, మధుమేహం, కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. బ్రోకలీలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలతో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. 

బచ్చలికూర

వృద్ధాప్యంలో రక్తహీనత సమస్య సర్వసాధారణం. శరీరంలో ఇనుము లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే ఈ వయసులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బచ్చలికూరలో ఐరన్ తో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ కూర అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

పాలు

వృద్ధాప్యంలో పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.  వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో విటమిన్ డి లోపిస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అలాగే ఎముకలు బలహీనపడతాయి. పాలు తాగడం ఇష్టం లేకపోతే..  సోయా పాలను తాగండి. 
 

డ్రై ఫ్రూట్స్

సాధారణంగా వృద్ధులు డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినరు. కానీ ఇవి వీళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల వయసు పైబడినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్, న్యూరోలాజికల్ సమస్యలు, జ్ఞాపకశక్తి దెబ్బతినడం, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం 60 ఏండ్ల తర్వాత బాగా పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ తింటే ఇలాంటి వ్యాధులు దూరమవుతాయి.
 

click me!