ఏం చేసినా జుట్టు ఊడిపోతూనే ఉందా..? అయితే ఈ సూపర్ ఫుడ్స్ ను తినండి..

First Published Aug 19, 2022, 3:36 PM IST

వానాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అయితే కొన్ని ఆహారాలను తినడం వల్ల జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. 
 

వర్షాకాలంలో వర్షాలతో పాటుగా.. రకరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. ఎందుకంటే వర్షంలో తడవడం, నెత్తిపై జిడ్డు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే ఈ సీజన్ లో జుట్టు గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే నెత్తిపై చుండ్రు ఏర్పడుతుంది. అలాగే వెంట్రుకలు కూడా చిట్లిపోతాయి. అంతేకాదు జుట్టు దారుణంగా ఊడిపోతుంది. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. దీనికోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే.. 

మెంతులు

మెంతులను వివిధ వంటల్లో ఉపయోగిస్తారు. అయితే మెంతుల్లో ఉండే ఔషద గుణాలు జుట్టు రాలడాన్ని కూడా ఆపుతాయి. అంతేకాదు ఇది జుట్టు త్వరగా తెల్లబడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ గింజలు హార్మోన్లను సక్రమంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 

హలీమ్ విత్తనాలు

ఈ హలీమ్ సీడ్స్ కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి. ఈ విత్తనాల్లో ఇనుము కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని పాలలో బాగా నానబెట్టి.. ప్రతిరోజూ రాత్రి తీసుకుంటే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది.  వీటిని నెయ్యి లడ్డూల్లో లేదా కొబ్బరి పొడిలో కలుపుకుని కూడా  తినొచ్చు. వీటిని ఎలా తిన్నా హెయిర్ ఫాల్ సమస్య మాత్రం పక్కాగా ఆగిపోతుంది. 

జాజికాయ

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి జాజికాయ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్లాస్ పాలకు చిటికెడు జాజికాయ పొడిని కలుపుకుని తాగితే జుట్టు ఊడిపోయే సమస్యే ఉండదు. ఎందుకంటే దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ సమస్యను పూర్తిగా తగ్గిస్తాయి.
 

ఈ టిప్స్ కూడా జుట్టు రాలడాన్ని ఆపుతాయి.. 

ఉసిరి హెయిర్ ఆయిల్ కూడా జుట్టు ఊడిపోకుండా నివారిస్తుంది. ఈ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుతుంది. ఉసిరిని ఫుడ్ లో తీసుకుంటే కూడా జుట్టు బలంగా ఉంటుంది. 
 

కలబంద కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కలబంద జెల్ ను హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలు తగ్గుతాయి. 

click me!