Moral story on trust and betrayal
ఒక రోజు ఓ వేటగాడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో అతనికి ఓ పులి కనిపిస్తుంది. పులి నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కుతాడు. అయితే అప్పటికే ఆ చెట్టుపై ఓ ఎలుగుబంటి పడుకుని ఉంటుంది. ఎలుగుబంటిని చూసిన ఆ వేటగాడు.. 'పులి నన్ను చంపాలని చూస్తోంది. దయచేసి నాకు చోటు కల్పించు' అని రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. దీంతో కనుకరించిన ఎలుగుబంటి సరే అని చెప్తుంది.
ఇంతలోనే చెట్టు కింద ఉన్న పులి, ఎలుగుబంటితో మాట్లాడుతూ.. 'ఆ మనిషి మన ఇద్దరికీ శత్రువు. అతన్ని కిందికి తొసేయ్ ఎంచక్కా ఇద్దరం కలిసి ఆరగిద్దాం' అని అంటుంది. అయితే ఎలుగుబంటి బదులిస్తూ.. 'లేదు నేను ఆపనిని చేయను. ఆయనను రక్షిస్తానని మాటిచ్చాను. నేను నమ్మకద్రోహం చేయను' అని చెబుతుంది.
దీంతో పులి ఈ సారి వేటగాడిని టార్గెట్ చేస్తుంది. అతనితో మాట్లాడుతూ.. 'నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఆ ఎలుగు బంటిని కిందికి తోసేస్తే నిన్ను వదిలేస్తా. ఎంచక్కా మీ ఇంటికి వెళ్లిపోవచ్చు' అని ఆశచూపుతుంది. దీంతో వేటగాడిలోని కన్నింగ్ నెస్ బయటపడుతుంది. పులి చెప్పినట్లుగానే ఎలుగుబంటిని కిందికి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు.
motivational-story
అయితే లక్కీగా ఆ ఎలుగుబంటి చెట్టు చివరి కొమ్మను పట్టుకొని మళ్లీ పైకి వెళ్లిపోతుంది. దీన్నే ఆసరగా చేసుకున్న పులి.. 'చూశావా ఎలుగు.. మనుషులు ఎంత స్వార్థపరులో. నిన్ను మోసం చేసిన వాడిని తోసేయ్' అని అంటుంది. అయినా ఎలుగు మాత్రం మాట తప్పదు. అతను నన్ను మోసం చేయాలని చూసినా సరే నేను మాత్రం నా ధర్మాన్ని వీడను, ఇచ్చిన మాటను మరువను అని తేల్చి చెబుతుంది.
దీంతో ఇది వర్కవుట్ అయ్యేలా లేదనుకుని పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎలుగు కూడా ఆ వేటగాడిని క్షమించేసి వెళ్లిపోతుంది. దీంతో వేటగాడికి పశ్చాతాపం మొదలవుతుంది. ఆ క్రూర జంతువుకు ఉన్న జ్ఞానం నాకు లేదని బాధపడుతూ వెళ్తుంటాడు. అయితే జీవితాంతం ఈ సంఘటన అతని మనసును వేధిస్తూనే ఉంటుంది. నమ్మకద్రోహం చేయాలని చూసిన అతని మనసును ఆ సంఘటన తొలచివేస్తూనే ఉంటుంది.
నీతి: మనల్ని నమ్మిన వ్యక్తిని ఎప్పటికీ మోసం చేయకూడదు. ఆ క్షణంలో అది మనకు సంతోషాన్ని ఇచ్చినా జీవితాంతం ఆ బాధ మనల్ని వేధిస్తూనే ఉంటుంది.