విశాఖ పట్టణాన్ని వైజాగ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

First Published | Nov 7, 2024, 2:54 PM IST

సాధారణంగా ప్రతి ఊరుకి ఓ షార్ట్ కట్ నేమ్ ఉంటుంది. అసలైన పేరుకంటే నోటికి పలికే ఆ పేరునే జనాలు పలుకుతుంటారు. కాని విశాఖ పట్ణం పేరు కాస్త వైజాగ్ అవ్వడం వెనుక చిత్రమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 
 

తెలుగు పండితులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు భాషలో ఏ పేరుకైనా పొల్లు(న్,ర్,క్) అక్షరాలు ఉండవు. శతాబ్దాల క్రితం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఊరి పేర్లు, మనుషుల పేర్లకు పొల్లు ఉండేవి కాదని తెలుస్తోంది. అప్పట్లో వారు రాసిన శాసనాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే బ్రిటీష్ పరిపాలన మొదలైనప్పటి నుంచి పేర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఆంగ్లేయులకు నోరు తిరగక, పలకడం రాక చాలా పేర్లు మార్చేశారు. 

విశాఖ పట్టణానికి ఆ పేరు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇసుక బాగా దొరకడం వల్ల ఇసుకపల్లి అనే వారని, అది కాస్తా తర్వాత కాలంలో విశాఖపట్నంగా మారిందని చెబుతారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.  మరో కథనం ఏంటంటే ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న వైశాఖ దేవి గుడి ఉండటం వల్ల ఆ అమ్మవారి పేరిట విశాఖపట్నంగా పేరు వచ్చింది. 

పురాణాల ప్రకారం పరమేశ్వరుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ పట్టణంలో అప్పట్లో గుడి ఉండేదట. స్వామి వారి నక్షత్రం కూడా విశాఖే కావడంతో విశాఖ పట్టణంగా పిలిచే వారని సమాచారం. 
 

Latest Videos


విశాఖ ప్రాంతాన్ని కళింగ రాజులు పాలించారు. అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నాక ఈ ప్రాంతంలో బౌద్ధ బిక్షువులు ఎక్కువగా సంచరించేవారు. పచ్చని కొండల మధ్య సముద్రం ఉండటంతో ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉండేది. దీంతో వారు ఈ ప్రాంతానికి ప్రత్యేక పేరు పెట్టాలని అనుకున్నారు. బుద్ధుడు పుట్టిన నక్షత్రం విశాఖ పేరుతో పిలిస్తే బాగుంటుందని విశాఖ పట్టణంగా పేరు పెట్టారని కొందరు చెబుతుంటారు. 

అదే విధంగా జైనమతం నుంచి బౌద్ధ మతంలోకి మారి తన ఆస్తినంతా బౌద్ధం వ్యాపించడానికి ఇచ్చేసి, సన్యాసిగా మారిన విశాఖ అనే భిక్షువు పేరుతో ఈ ప్రాంతానికి విశాఖ పట్టణం వచ్చిందని చెబుతుంటారు. 

సుమారు 800 సంవత్సరాల క్రితం  ఇశాక్ అనే ముస్లిం ఆధ్యాత్మిక గురువు పేరిట ఇశాక్ పట్టణం ఏర్పడిందని, కాలక్రమేణ విశాఖ పట్టణంగా మారిందని చెబుతారు. ఇవే కాకుండా విశాఖ పట్టణానికి ఆ పేరు రావడం వెనుక మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చాలా వాటికి ఆధారాలు లేవు. 
 

ఇక విశాఖ పట్టణం కాస్త వైజాగ్ ఎలా మారిందన్న విషయంలోనూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రిటీష్ వారు పరిపాలించే సమయంలో విశాఖ పట్టణాన్ని వారు పలక లేక వైజాగపట్టణం అని పిలిచే వారట. విశాఖ పట్టణం స్పెల్లింగ్ లో viని వారు "వై" అని, kh ని "గ" పలికేవారట. ఇంగ్లీష్ లో రాసేటప్పుడు కూడా visakha అని రాయకుండా vizaga అని రాసేవారట. షార్ట్ కట్ గా ఉంటుందని vizag అని పలికే వారట. అందువల్ల విశాఖ కాస్తా వైజాగ్ గా మారిందని చెబుతారు. 

దీనికి తోడు 1891 కాలంలో లభించిన మద్రాస్ ప్రెసిడెన్సీ మ్యాప్ లోనూ vizagapatam అని రాసి ఉండటం, వైజాగ్ పేరు ఎలా వచ్చిందనడానికి మరో ఆధారంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా 1655 నుంచి vizagapatam జిల్లాగా ఉందని రికార్డుల ద్వారా తెలుస్తోంది.

click me!