Summer: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. కొందరు ఎండలో ఆడుతుంటే, మరికొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ సమయాన్ని గడుపుతారు. అయితే ఈ సెలవులను సరదాగా, కొత్త విషయాలు నేర్చుకునేలా మార్చవచ్చు.
సమ్మర్‌లో చిన్న పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచే ప్రయోగాలు ఉంటాయి. సైన్స్ అంటే కష్టమైన సబ్జెక్ట్ కాదు. చిన్న చిన్న ప్రయోగాల ద్వారా సైన్స్‌ను ఆటలా నేర్చుకోవచ్చు. అలాంటి సరదా ప్రయోగాల్లో ఒకటి “గాలిబెలూన్ రాకెట్”. ఇది తయారు చేయడం సులభం. చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో గాలి శక్తి ఎలా పనిచేస్తుందో పిల్లలకు అర్థమవుతుంది. గాలిబెలూన్ రాకెట్ అనేది బెలూన్‌లో ఉన్న గాలి బయటకు వచ్చినప్పుడు అది ముందుకు వెళ్లే విధానాన్ని చూపించే చిన్న ప్రయోగం. అంతరిక్ష రాకెట్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. రాకెట్ వెనుక భాగం నుంచి వాయువులు వేగంగా బయటకు వస్తే, రాకెట్ ముందుకు దూసుకెళ్తుంది. ఈ ప్రయోగం ద్వారా పిల్లలు “ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది” అనే సైన్స్ సూత్రాన్ని సులభంగా తెలుసుకోగలరు.
25
ఈ ప్రయోగానికి కావాల్సిన వస్తువులు
ఈ రాకెట్ తయారీకి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. ఇంట్లోనే దొరికే వస్తువులతో తయారు చేయవచ్చు. అవసరమైన వస్తువులు ఒక బెలూన్, పొడవైన దారం లేదా తాడు (సుమారు 3 నుంచి 5 మీటర్లు), ఒక స్ట్రా (జ్యూస్ తాగే గొట్టం), సెలోటేప్, రెండు కుర్చీలు లేదా దారాన్ని కట్టడానికి రెండు స్థిరమైన వస్తువులు. ఈ వస్తువులు సిద్ధంగా ఉంటే ప్రయోగం ప్రారంభించవచ్చు.
35
గాలిబెలూన్ రాకెట్ ఎలా తయారు చేయాలి?
* మొదట దారాన్ని స్ట్రా లోపల నుంచి దూర్చాలి.
* దారాన్ని రెండు కుర్చీల మధ్య గట్టిగా కట్టాలి. దారం సూటిగా ఉండాలి.
* అనంతరం బెలూన్‌ను బాగా ఊదాలి. కానీ దాని నోరు కట్టకూడదు. చేత్తో పట్టుకోవాలి.
* స్ట్రాకు బెలూన్‌ను సెలోటేప్‌తో అంటించాలి.
* ఇప్పుడు బెలూన్ నోరు వదిలేయాలి. అంతే! బెలూన్‌లోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది. బెలూన్ స్ట్రాతో కలిసి దారం వెంట వేగంగా ముందుకు వెళ్తుంది. ఇది చిన్న రాకెట్‌లా కనిపిస్తుంది.
బెలూన్‌లో గాలి నింపినప్పుడు అందులో ఒత్తిడి ఏర్పడుతుంది. బెలూన్ నోరు వదిలిన వెంటనే ఆ గాలి వెనుక వైపు వేగంగా బయటకు వస్తుంది. గాలి వెనక్కి వెళ్లినప్పుడు బెలూన్ ముందుకు కదులుతుంది. దీనినే శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ చెప్పిన మూడవ చలన నియమం అంటారు. సరళంగా చెప్పాలంటే.. గాలి వెనక్కి వెళ్తుంది, బెలూన్ ముందుకు వస్తుంది. ఇదే “చర్య – ప్రతిచర్య” సూత్రం. అంతరిక్షంలోకి వెళ్లే పెద్ద రాకెట్లు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. అందుకే ఈ చిన్న ప్రయోగం ద్వారా పెద్ద శాస్త్రీయ సూత్రాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
55
పిల్లలకు ఈ ప్రయోగం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ గాలిబెలూన్ రాకెట్ కేవలం ఆట మాత్రమే కాదు. ఇందులో అనేక విద్యా ప్రయోజనాలు ఉన్నాయి. సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుంది, పుస్తకాల్లో చదివే విషయాలు కళ్ల ముందు కనిపిస్తే పిల్లలకు మరింత ఆసక్తి కలుగుతుంది, ఆలోచనా శక్తి పెరుగుతుంది. “ఎందుకు ముందుకు వెళ్లింది?”, “గాలి ఎక్కువ నింపితే ఏమవుతుంది?” వంటి ప్రశ్నలు పిల్లల్లో కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి.