
జుట్టు ఒత్తుగా ఉండాలి.. అందంగా ఉండాలి అని అందరికీ ఉంటుంది. దాని కోసమే.. అందరూ ఖరీదైన షాంపూలు, నూనెలు కూడా వాడుతూ ఉంటారు. కానీ, రోజూ వాడే దువ్వెన గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. చాలా మంది.. బాగానే ఉంది కదా అని నెలల తరబడి ఒకే దువ్వెన వాడుతూ ఉంటారు. కానీ, దువ్వెన మాత్రం మార్చరు. అసలు.. దువ్వెన ఎందుకు మార్చాలి? ఎన్ని నెలలకు ఒకసారి మీరు దువ్వెన మారుస్తూ ఉండాలి? దువ్వెన మార్చకపోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు..?
1. దువ్వెన పళ్ళు విరిగిపోవడం లేదా వంగిపోవడం
దువ్వెనకు ఉండే పళ్ళు వంగిపోయినా, ఊడిపోయినా లేదా హీట్ వల్ల కరిగిపోయినా వెంటనే దాన్ని మార్చేయాలి. విరిగిపోయిన పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వడం వల్ల అది జుట్టును గట్టిగా లాగి, జుట్టు తెగిపోయేలా చేస్తుంది.
2. చివర ఉండే బాల్స్ ఊడిపోవడం చాలా హెయిర్‌బ్రష్‌లకు చివర చిన్న రౌండ్ బాల్స్ ఉంటాయి. ఇవి తలకు దెబ్బ తగలకుండా కాపాడతాయి. ఒకవేళ ఈ బాల్స్ ఊడిపోతే, ఆ పళ్ళు సూదిలా మారి తల చర్మాన్ని గుచ్చుకుని గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు చేసే ప్రమాదం ఉంది. అందుకే, బాల్స్ ఊడిపోతే వెంటనే దువ్వెన మార్చేయాలి.
3. ఎంత శుభ్రం చేసినా వదలకుండా పేరుకుపోయిన మురికి..
దువ్వెనలో జుట్టుతో పాటు తలలోని సహజ నూనెలు, డెడ్ స్కిన్ కణాలు, డస్ట్ పేరుకుపోతాయి. ఎంత సబ్బు నీళ్లలో నానబెట్టి కడిగినా దువ్వెన అడుగున తెల్లటి లేదా నల్లటి మురికి వదలకుంటే, ఆ దువ్వెనను వెంటనే మార్చేయడమే మంచిది . ఆ మురికి మళ్లీ మీ శుభ్రమైన జుట్టుకు అంటుకుని జుట్టును జిడ్డుగా మారుస్తుంది.
4. రబ్బర్ ప్యాడ్‌లో పగుళ్లు రావడం
ప్యాడింగ్ ఉండే బ్రష్‌లలో రబ్బర్ బేస్‌పై పగుళ్లు ఏర్పడితే, ఆ రంధ్రాల లోపలికి తేమ, మురికి చేరి బాక్టీరియా, ఫంగస్ తయారవుతాయి. ఇది తలలో చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
5. దువ్వెన వాడినా జుట్టు సరిగ్గా చిక్కులు విడకపోవడం పాతబడిపోయిన దువ్వెనతో దువ్వినప్పుడు జుట్టు స్మూత్‌గా రాకపోగా, ఎక్కువగా చిక్కుపడిపోతుంటే లేదా జుట్టు విపరీతంగా రాపిడికి గురవుతుంటే ఆ బ్రష్ దాని పనితనాన్ని కోల్పోయిందని అర్థం.
రోజూ దువ్వెన వాడిన తర్వాత అందులోని జుట్టును తీసేయాలి. అలాగే వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి బ్రష్‌ను శుభ్రం చేయడం వల్ల దాని ఆయుష్షు పెరుగుతుంది.
నెలల తరబడి ముఖ్యంగా 6 నుండి 12 నెలలకు పైగా సరిగ్గా శుభ్రం చేయని లేదా పాతబడిపోయిన ఒకే దువ్వెనను నిరంతరం వాడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. పాత దువ్వెన పళ్ళపై డెడ్ స్కిన్ కణాలు, జిడ్డు, దుమ్ము, పాత హెయిర్ ప్రోడక్ట్‌లు పేరుకుపోయి బాక్టీరియా, ఫంగస్‌కు నిలయంగా మారతాయి. వీటితో మళ్లీ తలను దువ్వినప్పుడు ఆ మురికి తిరిగి కుదుళ్లలోకి చేరి చుండ్రు , ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురదకు దారితీస్తుంది. అంతేకాకుండా, పాతబడటం వల్ల దువ్వెన పళ్ళు లేదా కుచ్చులు క్షీణించి వాడిగా మారడం వల్ల అవి తల చర్మాన్ని గీరి గాయాలు చేయడం, తద్వారా కుదుళ్లు బలహీనపడి విపరీతంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. అందుకే.. రెగ్యులర్ గా దువ్వెన మార్చడం చాలా అవసరం.