
వాతావరణం మారినప్పుడల్లా ఇంట్లో ఎలుకల బెడద పెరగడం కామన్. రాత్రి పూట గోడల వెనుక శబ్దాలు రావడం, ఫర్నిచర్‌ను కొరికేయడం, వంటగదిలో ఎలుకల మలం కనిపించడం లాంటివి ఇంట్లోకి ఎలుకలు వచ్చాయనడానికి సంకేతాలు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, అవి లోపలికి వచ్చే దారులను మూసేయడం చాలా ముఖ్యం. దీనికోసం 'పెన్సిల్ ట్రిక్' (Pencil Trick) బాగా పనిచేస్తుంది. పెన్సిల్ వెనకాల ఉండే ఎరేజర్ సైజును బట్టి ఎలుకలు దూరే చిన్న చిన్న కన్నాలను సులభంగా కనిపెట్టొచ్చు.
ఎలుకలు చాలా చిన్న సందుల నుంచి కూడా ఇంట్లోకి దూరిపోతాయి. కేవలం 5 మిల్లీమీటర్ల గ్యాప్ ఉన్నా సరే అవి లోపలికి వచ్చేస్తాయి. ఇది దాదాపు పెన్సిల్ ఎరేజర్ వెడల్పుతో సమానం.
మనుషుల్లాగా ఎలుకల కాలర్ బోన్స్ గట్టిగా అతుక్కుని ఉండవు. వాటి శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే ఎంత చిన్న సందులోంచైనా తమ శరీరాన్ని కుదించుకుని మరీ దూరిపోతాయి. కంటికి కనిపించనంత చిన్న సందులు కూడా వీటికి రాజమార్గాలు లాంటివే.
అందుకే పెన్సిల్ ఎరేజర్‌ను ఒక కొలమానంగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. గోడలు, తలుపులు, పైపులు, కరెంటు వైర్ల దగ్గర పెన్సిల్ ఎరేజర్ పట్టేంత గ్యాప్ ఉందో లేదో చెక్ చేయండి. అయితే, ఈ ట్రిక్ ద్వారా ఎలుకలు వచ్చే దారులను మాత్రమే కనిపెట్టగలం. ఆ తర్వాత వాటిని మూసేయడం మన బాధ్యత.
ఇంట్లోకి ఎలుకలు వచ్చే దారులను కనిపెట్టడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
గదుల మూలలు, నేల-గోడ కలిసే చోటు, తలుపుల కింద ఉన్న సందులను జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా పైపులు, కరెంటు వైర్లు గోడలోకి వెళ్లే చోట బాగా చెక్ చేయండి.
మీకు అనుమానం ఉన్న సందులు పెన్సిల్ ఎరేజర్ పట్టేంత వెడల్పు ఉన్నాయో లేదో చూడండి. అలాంటివి కనిపిస్తే వెంటనే గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటిని మూసేయడానికి ఇది హెల్ప్ అవుతుంది.
వంటగది క్యాబినెట్ల వెనుక, ఫ్రిడ్జ్ దగ్గర, స్టవ్ వెనుక లాంటి చీకటి ప్రదేశాల్లో కూడా వెతకండి. గది మధ్యలో చూస్తే లాభం లేదు. ఎలుకలు ఎప్పుడూ దాక్కోవడానికి ఇష్టపడతాయి కాబట్టి మూలల్లోనే వాటి దారులు ఉంటాయి.
సందులను గుర్తించాక వాటిని సరైన వస్తువులతో మూసేయాలి. బ్రిటిష్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్ (BPCA) సూచనల ప్రకారం.. చిన్న సందుల్లో వైర్ వూల్ (Wire Wool) పెట్టి, త్వరగా గట్టిపడే సిమెంట్ పూయాలి.
పెద్ద కన్నాలు ఉంటే మాత్రం పెస్ట్ కంట్రోల్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గాలి కోసం పెట్టిన వెంటిలేషన్ కన్నాలను మాత్రం మూసేయకండి. ఇంట్లోకి గాలి వెలుతురు రావడం చాలా ముఖ్యం.
ప్లాస్టిక్, సిలికాన్, ప్లాస్టిక్ నెట్, చెక్క, రబ్బరు లాంటి మెత్తటి వస్తువులతో సందులను మూయకండి. ఎందుకంటే ఎలుకలు వాటిని సులభంగా కొరికేస్తాయి. కొన్నిచోట్ల ఎక్స్‌పాండింగ్ ఫోమ్ (Expanding Foam), స్టీల్ వూల్ (Steel Wool) కలిపి వాడొచ్చు. అయితే కన్నం సైజును బట్టి సరైన వస్తువును ఎంచుకోవాలి.
పెన్సిల్ ట్రిక్‌తో దారులను కనిపెట్టడం మొదటి స్టెప్ మాత్రమే. ఇంట్లో ఇప్పటికే ఎలుకల మలం కనిపించినా, రాత్రిళ్లు శబ్దాలు వచ్చినా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బియ్యం, పప్పులు, పాస్తా, స్నాక్స్ లాంటి ఆహార పదార్థాలను కవర్లలో ఓపెన్‌గా ఉంచకండి. గాలి చొరబడని గట్టి డబ్బాల్లో వాటిని భద్రపరచండి.
వంటగది ప్లాట్‌ఫామ్ మీద పడిన ఆహారపు ముక్కలను వెంటనే శుభ్రం చేయండి. టోస్టర్ లాంటి వస్తువుల వెనుక, క్యాబినెట్ల కింద ఏమైనా ఫుడ్ పడిందేమో చెక్ చేయండి.
పెంపుడు జంతువుల ఆహారాన్ని, చెత్తను రాత్రిపూట ఓపెన్‌గా వదిలేయకండి. డస్ట్‌బిన్ మూత గట్టిగా ఉండేలా చూసుకోండి.
చిన్న ఫుడ్ ముక్క దొరికినా సరే ఎలుకలు అక్కడే తిష్టవేస్తాయి. కాబట్టి వాటికి ఆహారం దొరకకుండా చేస్తే సగం బెడద తగ్గినట్లే.
సింక్ కింద, ఫ్రిడ్జ్ వెనుక, స్టవ్ వెనుక, క్యాబినెట్ల వెనుక ఎలుకలు దాక్కునే ఛాన్స్ ఉంది. అక్కడ ఈ కింది ఆనవాళ్లు ఉన్నాయేమో గమనించండి:
• చిన్నపాటి నల్లటి మలం.
• చెక్క లేదా ఇతర వస్తువులను కొరికిన ఆనవాళ్లు.
• చిరిగిన కాగితాలు లేదా బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటం.
• ఎలుకలు తిరిగినట్లు అనిపించే ఇతర గుర్తులు.
ఎలుకలు గూడు కట్టుకోవడానికి కాగితాలు, బట్టలను వాడుకుంటాయి. వెచ్చగా, సురక్షితంగా ఉండి, ఆహారం దొరికే చీకటి ప్రదేశాలంటే వాటికి చాలా ఇష్టం.
ఎక్కడైనా కొత్తగా మలం లేదా కొరికిన ఆనవాళ్లు కనిపిస్తే ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఎలుకలు ఎక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయో అర్థమవుతుంది.
ఆరోగ్య సూచన: ఎలుకల మలాన్ని ఎప్పుడూ వట్టి చేతులతో ముట్టుకోవద్దు. వాటిని పొడిగా ఉన్నప్పుడు ఊడ్చడం లేదా దుమ్ము లేచేలా శుభ్రం చేయడం చేయకండి. సరైన క్రిమిసంహారక మందు (Disinfectant) వాడి జాగ్రత్తగా క్లీన్ చేయండి. తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోండి, ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి.
ఇంట్లో ఒక్క ఎలుక కనిపించినా లైట్ తీసుకోకండి. వాటికి ఆహారం, సురక్షితమైన చోటు దొరికితే వాటి సంఖ్య వేగంగా పెరిగిపోతుంది.
ఫుడ్ దాచడం, కన్నాలు మూసేయడం లాంటివి చేసినా సరే.. కొత్తగా మలం కనిపించినా, శబ్దాలు వచ్చినా వెంటనే పెస్ట్ కంట్రోల్ నిపుణులను పిలవండి.
అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు తమ ఓనర్‌కు లేదా బిల్డింగ్ మేనేజ్‌మెంట్‌కు ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఎలుకలు కామన్ గోడలు, పైపుల ద్వారా కూడా ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది.
ఎలుకలను అడ్డుకోవడానికి గుర్తుంచుకోవాల్సినవి!
ఎలుకలను అడ్డుకోవడానికి ఖరీదైన వస్తువులే అక్కర్లేదు. పెన్సిల్ ఎరేజర్‌తో సందులను కనిపెట్టడం అనేది ఒక సింపుల్ ట్రిక్. దీనికి తోడు ఆహారాన్ని భద్రపరచడం, వంటగదిని శుభ్రంగా ఉంచడం, కన్నాలను సరైన వస్తువులతో మూసేయడం లాంటివి క్రమం తప్పకుండా చేయాలి.