ఎంత ఇష్టపడి కొన్న మామిడి పండ్లు తినకుండా దాచిపెడితే వెంటనే పాడైపోతున్నాయా..? అయితే మామిడి పండ్లను 15 రోజుల వరకు తాజాగా, పాడవకుండా నిల్వ ఉండాలంటే ఈ సూపర్ టిప్స్, నిపుణుల సలహాలు పాటించండి.
వేసవి వచ్చిందంటే చాలు… ఇళ్లంతా మామిడి పండ్ల సువాసనతో నిండిపోతుంది. చాలామంది రూ.100-200 కు కిలో అయినా సరే ఎంతో ఇష్టపడి ఈ పండ్లను కొంటారు. కానీ మామిడి పండ్లు ఓ రెండ్రోజులు కూడా నిల్వ ఉండవు… తినడం కాస్త ఆలయస్యమయ్యిందా మెత్తబడి కుళ్లిపోతాయి. ఇలా ఇష్టంగా కొన్న పండ్లు పాడయిపోతే బాధగా ఉంటుంది.
అయితే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే మామిడి పండ్లు వాటి రుచిని, నాణ్యతను కోల్పోతాయి. మరి మామిడి పండ్లను 10-15 రోజుల వరకు తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
26
కొనేటప్పుడు జాగ్రత్త..
చాలామంది పూర్తిగా పండిన, మెత్తటి పండ్లనే ఎంచుకుంటారు. కానీ కొనేటప్పుడు కొద్దిగా దోరగా లేదా కాస్త గట్టిగా ఉన్న పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఇంట్లో నెమ్మదిగా పండుతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కొనేటప్పుడు పండు మీద ఎలాంటి నల్ల మచ్చలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
36
పండిన పండ్లు, కాయలు ఒకేచోట ఉంచొద్దు..
బాగా పండిన మామిడి పండ్లు సహజంగా 'ఇథిలీన్' అనే గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఇది కాయలు త్వరగా పక్వానికి రావడానికి సహాయపడుతుంది. అందుకే పూర్తిగా పండిన మామిడి పండ్లను, పచ్చి కాయలను కలిపి ఉంచవద్దు.
బాగా పండిన పండు విడుదల చేసే ఇథిలీన్ పక్కనున్న కాయలను టైమ్‌కి ముందే పండిస్తుంది… దీంతో ఒకేసారి పండ్లు అవుతాయి… తొందరగా తినలేదో అవి కుళ్లిపోతాయి. ఆపిల్, అరటిపండ్ల నుంచి కూడా మామిడి పండ్లను దూరంగా ఉంచాలి… ఎందుకంటే అవి కూడా ఇథిలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి.
మామిడి పండ్లకు గాలి బాగా తగలడం చాలా ముఖ్యం. మార్కెట్ నుంచి తీసుకురాగానే ప్లాస్టిక్ కవర్ల నుంచి పండ్లను బయటకు తీయండి. అలాగే ఉంచితే లోపల వేడి పెరిగి పండ్లు చెమట పడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా చేరి పండు త్వరగా మెత్తబడుతుంది. పండ్లను వెదురు బుట్టల్లో లేదా గాలి ఆడే చెక్క పెట్టెల్లో ఉంచడం మంచిది. నేలపై పేపర్ వేసి, దానిపై పండ్లను విడివిడిగా పెట్టడం కూడా మంచి పద్ధతే.
56
మామిడి పండ్లను కడగకండి...
మామిడి పండ్లను నిల్వ చేసే ముందు ఎప్పుడూ కడగకండి. తేమ ఉంటే ఫంగస్ లేదా బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పండ్లను త్వరగా పండించాలనుకుంటే వాటిని బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో ఉంచండి. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే, ఒక్కో పండును విడివిడిగా న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి పెట్టండి. ఇది పండులోని అదనపు తేమను పీల్చుకుంటుంది.
66
వెంటనే ఫ్రిజ్ లో పెట్టకండి..
చాలా మంది చేసే సాధారణ తప్పు ఏంటంటే, పచ్చిగా లేదా పూర్తిగా పండని మామిడికాయలను ఫ్రిజ్‌లో పెట్టడం. పండ్లు పూర్తిగా పండే వరకు వాటిని గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్దే ఉంచాలి. పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కూడా ఒకదానిపై ఒకటి వేయకుండా, టిష్యూ పేపర్‌లో చుట్టి వెజిటబుల్ బాక్స్‌లో పెడితే 5-7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లను రోజుకొకసారి మెల్లగా తిప్పుతూ ఉండండి. ఒకేచోట ఎక్కువ రోజులు ఉంచితే ఆ భాగంపై ఒత్తిడి పడి పండు మెత్తబడి పాడవ్వొచ్చు.