జుట్టు ఊడిపోతుంటే.. షాంపూను మార్చాల్సిందేనా..?

First Published Sep 9, 2022, 3:03 PM IST

ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, హార్మోన్లలో మార్పులు వంటివి జుట్టు రాలడానికి కారణాలు. అయితే కొంతమంది జుట్టు రాలిపోతే చాలు షాంపూ వల్లే అని షాంపూలను మారుస్తూ ఉంటారు. షాంపూను మారిస్తే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందా..? 

ఈ  రోజుల్లో హెయిర్ ఫాల్ సర్వసాధారణ సమస్యగా తయారైంది. ఇక అబ్బాయిలకు 25 ఏండ్లలోనే బట్టతల వస్తుంది. అమ్మాయిల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగానే ఉంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు తరచుగా షాంపూలను మార్చడం, హెయిర్ ఆయిల్ ను చేంజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే హెయిర్ ఫాల్ ను తగ్గించడం చాలా సులువు.

వాతావరణం నుంచి మొదలు పెడితే.. హార్మోన్లలో హెచ్చు తగ్గులు, ఒత్తిడి, పోషకాల లోపం, చెడు ఆహారపు అలవాట్లు వంటివి అనేక కారణాలు ఉన్నాయి. మీ జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవాలి. అప్పుడే మీ జుట్టు ఊడిపోవడాన్ని ఆపుతారు. కానీ ఇవేవీ తెలుసుకోకుండా షాంపూను మార్చడం, నూనెను మార్చడం వేస్ట్ అంటున్నారు నిపుణులు. అసలు షాంపూను చేంజ్ చేస్తే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందా? లేదా? అనేది తెలుసుకుందాం పదండి. 


షాంపూ పెట్డడం వల్ల జుట్టు ఊడిపోతుందా? 

ఈ షాంపూను పెట్టడం వల్లే జుట్టు విపరీతంగా రాలిపోతుందని నమ్మే వారు చాలా మందే ఉన్నారు. కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. అందులోనూ షాంపూను వారానికి ఒకే సారే పెట్టాలి. వారానికి రెండు, మూడు సార్లు పెడితే జుట్టు ఊడిపోతుందని కూడా చెప్తుంటారు. కానీ  ఇందులో ఏ మాత్రం  వాస్తవం లేదంటున్నారు నిపుణులు. నిజానికి దుమ్ము, ధూళి, చెమట ఎక్కువగా పట్టే ప్లేసెస్ లో ఉన్నట్టైతే మీరు ప్రతిరోజూ షాంపూతో స్నానం చేయాల్సిందే. ఒకవేళ మీరు షాంపూతో తలస్నానం చేయకుండే మీ నెత్తిలో పట్టిన చెమట జుట్టు ఊడిపోయేలా చేస్తుంది.
 


షాంపూను మార్చితే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందా..? 

షాంపూను మార్చితే చాలు జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందని నమ్మే వారు చాలా మందే ఉన్నారు. కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదు. తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూను ఉపయోగిస్తే మీ జుట్టు ఊడిపోదు. ముఖ్యంగా షాంపుతోనే మీ నెత్తిమీదున్న దుమ్ము, దూళి, చెమట పోతాయి. అందుకే షాంపూను మార్చడం కాదు ముందు మీ జుట్టు ఏ కారణం చేత ఊడిపోతుందో తెలుసుకోండి.
 


సల్ఫేట్ కలిగిన షాంపూ హెయిర్ ఫాల్ కు కారణమవుతుందా?

సల్ఫేట్ కలిగి ఉన్న షాంపూ జుట్టుకు ఏమాత్రం మంచిది కాదని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజం ఏంటంటే.. సల్ఫేట్ ఒక శుభ్రపరిచే ఏజెంట్. ఇది నెత్తిమీద మురికిని, చెమటను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది జుట్టుకు మంచిది కాదని డిసైడ్ చేయలేం. అయితే జుట్టు రకాన్ని బట్టి షాంపూను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
 

click me!