Good Parenting: పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమించాలన్నా, గౌరవించాలన్నా వారి ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది. కొన్ని లక్షణాలున్న తల్లిదండ్రులను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఆ లక్షణాల గురించి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆధునిక కాలంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య దూరం పెరిగిపోతోంది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం, పని ఒత్తిడి.. వంటవి కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి. పిల్లలు.. తల్లిదండ్రుల నుంచి అపారమైన ప్రేమను కోరుకుంటే, తల్లిదండ్రులు పిల్లల నుంచి గౌరవం కావాలనుకుంటారు. పిల్లలు పెద్దయ్యాక కూడా తమ తల్లిదండ్రులను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవాలంటే చిన్నప్పుడు వారిపై ఎనలేని ప్రేమను చూపించాలి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్న తల్లిదండ్రులంటే పిల్లలకు ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ లక్షణాల గురించి మీరు తెలుసుకోండి.
25
చెప్పేది వినేవారు
తాము చెప్పేది శ్రద్ధగా వినాలని పిల్లలు కోరుకుంటారు. కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేయడం లేదా కొట్టి పారేయడం వంటివి చేస్తారు. మంచి తల్లిదండ్రుులుగా ఎదగాలనుకుంటే మీరు అలాంటి పనులు చేయకూడదు. పిల్లలు ఏమనుకుంటున్నారో, వారు ఏమి ఫీల్ అవుతున్నారో.. పూర్తిగా వినాలి. వారి మాటలకు విలువ ఇవ్వాలి. అలా విన్నప్పుడే పిల్లలకు తనను అర్థం చేసుకునే అమ్మా నాన్నా దొరికారని ఆనందపడతారు.
35
తప్పులు ఎంచడం
కొంతమంది తల్లిదండ్రులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా, గేమ్స్ లో ఓడిపోయినా పిల్లలను తిట్టడం, ఇతర పిల్లలతో పోల్చడం వంటివి చేస్తారు. అలా చేసే తల్లిదండ్రులను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. వచ్చిన ఫలితం కంటే తమ పిల్లలు చేసే ప్రయత్నాన్ని ముందుగా మెచ్చుకోవాలి. అప్పుడే మీరు మంచి తల్లిదండ్రులుగా పిల్లల దగ్గర గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లల కష్టాన్ని, వారి ప్రయత్నాలను మీరు గుర్తించాలి. ‘నువ్వు కష్టపడ్డావు, నాకు చాలా సంతోషంగా ఉంది’ అనే ఒకే ఒక డైలాగ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇలా పెరిగిన పిల్లలు తల్లిదండ్రులను తమ బలంగా భావిస్తారు.
పిల్లల శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు మౌనంగా ఉన్నా, చిరాకుగా ప్రవర్తిస్తున్నా దాని వెనుక ఏదో కారణం ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే వారి భావోద్వేగాలను గమనించి, వారి బాధలో ఉన్నప్పుడు అండగా నిలవాలి. వారి బాధ తీరే విధంగా మాట్లాడాలి, ధైర్యం చెప్పాలి. ఇది వారికి మానసికంగా తల్లిదండ్రులు తమ తోడు ఉన్నారనే భావానను కలిగిస్తుంది. అలాంటి తల్లిదండ్రులంటే పిల్లలు ప్రాణంగా ప్రేమిస్తారు.
55
తప్పు కాదు గుణపాఠం
పిల్లలు చేసే తప్పులను పెద్దవిగా చూడకుండా వాటి నుంచి ఒక గుణపాఠం పిల్లలు నేర్చుకునేలా తల్లిదండ్రులు చేయాలి. ఏ తప్పూ చేయకుండా ఏ పిల్లవాడు ఎదగడు. ప్రతి చిన్న తప్పుకు వారిపై కోప్పడడం, వారిని తీవ్రంగా భయపెట్టడం చేస్తే పిల్లల్లో భయం పెరుగుతుంది తప్ప... తల్లిదండ్రులు పట్ల ప్రేమ, గౌరవం పెరగవు. ‘తప్పయిందా.. పరవాలేదు మళ్లీ ఇలా చేయకుండా జాగ్రత్తపడు’ అని చెబితే పిల్లలకు మీ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుంచి దూరం కావాలని ఏనాడు కోరుకోరు.
పిల్లలపై తల్లిదండ్రులు చెప్పే మాటలు కన్నా వారి ప్రవర్తనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఇంట్లో నిజాయితీగా, సహనంగా, ఇతరులను గౌరవిస్తూ ఉంటే ఆ లక్షణాలు పిల్లలకు కూడా వస్తాయి. మా అమ్మ నాన్న లాగే నేను కూడా ఉండాలి అని పిల్లలు భావిస్తారు. ఇలాంటి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు మంచి వారిగా ఎదుగుతారు. అలాగే వారి తల్లిదండ్రులను విపరీతంగా ప్రేమిస్తారు.