క్యారెట్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా కంటి చూపును పెంచుతాయి..!

First Published Aug 18, 2022, 9:58 AM IST

క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును పెంచడమే కాదు.. కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కళ్లు బాగా కనిపించేలా చేయడానికి క్యారెట్లే కాదు.. ఈ ఆహారాలు కూడా ఉపయోగపడతాయి.. 
 

చాలా వరకు మన ఆరోగ్యం మనం తినే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేందుకు, సక్రమంగా పనిచేసేందుకు పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఆహారమే మన కంటి చూపు బాగుండాలా? తగ్గాలా? అనేది డిసైడ్ చేస్తుందన్న ముచ్చట మీకు తెలుసా..? అవును మంచి పోషకాహారం తీసుకుంటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. లేదంటే పెద్ద పెద్ద సైట్ కళ్లద్దాలను పెట్టుకోకతప్పదు. ఇంతకీ కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

క్యారెట్లు

క్యారెట్లలో బీటా-కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రెటీనాతో సహా కంటిలోని అనేక భాగాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే క్యారెట్లు కంటికి ఎంతో మేలు చేస్తాయని  నిపుణులు చెబుతుంటారు. క్యారెట్లు మాత్రమే కాదు.. ఎన్నో ఇతర ఆహారాలు కూడా ఈ విధంగా కంటికి మేలు చేస్తాయి. అవేంటంటే..
 

బెండకాయ

బెండకాయలో ఎన్నో పోషకగుణాలుంటాయి. దాదాపుగా దీన్ని ప్రతిరోజూ తినేవాళ్లు కూడా ఉన్నారు. దీనిలో కూడా కంటి చూపును మెరుగుపరిచే బీటా కెరోటిన్ ఉంటుంది. అందుకే ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి  కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆప్రికాట్

ఆప్రికాట్ లు మన దేశంలో అంత సులువుగా దొరకవు. కానీ ఇవి కళ్లకు చాలా మంచివి. వీటిలో ఉండే బీటా కెరాటిన్ కంటి చూపును పెంచుతాయి. ఆప్రికాట్లలో విటమిన్-సి, విటమిన్ ఇ, జింక్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కంటిని ప్రభావితం చేసే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

బ్రోకలీ

బ్రోకలీ మన దేశంలో పండదు. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది కళ్లకు కూడా మంచిది. దీనిలో 'లుటిన్' అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు మేలు చేస్తాయి. దీనిలో విటమిన్-సి, బీటా-కెరాటిన్,  జియాక్సంతిన్ లు కూడా ఉంటాయి. మొత్తంగా బ్రోకలీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. 
 

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ పండ్లు కూడా కంటి చుపును పెంచుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో లుటిన్, సీక్సాంథిన్ కూడా ఉంటాయి. నిమ్మకాయ,  నారింజ, బెర్రీలు వంటి సిట్రస్ పండ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిలోని నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

బాదం పప్పులు, వాల్ నట్స్

బాదం, వాల్ నట్స్ లో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల రోగాల నుంచి కాపాడుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ,  జింక్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

click me!