
ఏ నొప్పినైనా తట్టుకోవచ్చు. కానీ పంటి నొప్పిని మాత్రం తట్టుకోలేం. పంటినొప్పి వల్ల దవడల చుట్టూరా భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి చాలా సార్లు రోజుల తరబడి ఉంటుంది. కొన్ని సార్లు గంటల్లో తగ్గిపోతుంది. అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియదు. మన ఇంట్లో కొన్ని పదార్థాలతో కూడా ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పుచ్చు పళ్లు, పంటి నొప్పిని తగ్గించుకోవడానికి మీరు లవంగం నూనెను ఉపయోగించొచ్చు. ఈ నొప్పిని తగ్గించడంలో లవంగం నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ లవంగం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. పంటి నొప్పి తగ్గడానికి దూది తీసుకుని దానిపై రెండుమూడు చుక్కల లవంగం నూనె వేసి పంటిపై పెట్టండి. 10 నిమిషాల తర్వత తీసేసి గోరువెచ్చని నీళ్లతో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.
పసుపు, ఉప్పుతో పంటి నొప్పి తగ్గుతుంది
ఉప్పు, పసుపును ఉపయోగించి కూడా పంటి నొప్పిని తగ్గించుకోవచోచు. ఇది పళ్లను శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పంటి ఇన్పెక్షన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనితో పంటి నొప్పిని తగ్గించుకోవడానికి ఒక స్పూన్ పసుపులో కొంచెం ఉప్పును వేసి కలపండి. దీన్ని నొప్పిగా ఉన్న పంటిపై ఐదు నిమిషాలు ఉంచండి. తర్వాత నోటిని గోరువెచ్చని నీటితో పుక్కిలించండి.
వేపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులను ఉపయోగించి మనం ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో పంటినొప్పి కూడా ఉంది. అవును వేపాకులను ఉపయోగించి మనం పంటి నొప్పిని తొందరగా తగ్గించుకోవచ్చు. ఎన్నో ఏండ్ల నుంచి దంతాలను బలంగా ఉంచుకోవడానికి వేపను ఉపయోగిస్తూ వస్తున్నారు.
పంటి నొప్పి తగ్గడానికి కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా చేయండి. ఈ పేస్ట్ ను నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. పుచ్చు పళ్లకు కూడా దీన్ని రాసుకోవచ్చు. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే పళ్లు పుచ్చుపోయే అవకాశం కూడా తగ్గుతుంది. దంతాలు బలంగా అవుతాయి. రోజూ వేప పుళ్లతో తోమడం కూడా మంచిది.
వెల్లుల్లి తో నొప్పి మాయం
వెల్లుల్లిలో ఉండే ఔషదగుణాలు పంటి నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. మీకు పంటి నొప్పి వచ్చినప్పుడు రెండుమూడు వెల్లుల్లి రెబ్బలను నలిపి అందులో కొంచె ఉప్పును వేసి కలపండి. దీన్ని నొప్పిగా ఉన్న పంటిపై పెట్టండి. దీంతో వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుంది.
పంటి నొప్పి తగ్గడానికి గోరువెచ్చని నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొంచెం కల్లుప్పును వేసి కలపండి. వీటిని పుక్కిలిస్తే దంతాల సందుల్లో ఉండే క్రిములు తొలగిపోతాయి. మురికి కూడా తొలగిపోతుంది. అంతేకాదు ఈ వాటర్ ను పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పంటి నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
దీనితో పాటుగా పంటి నొప్పి తగ్గడానికి ఐస్ కూడా సహాయపడుతుంది. ఇందుకోసం పంటి నొప్పి ఉన్న చోట ఐస్ ను పెట్టండి. అయితే ఐస్ ను నేరుగా కాకుండా ఒక క్లాత్ లో పెట్టి ఉపయోగించండి. దీనివల్ల రక్తప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అలాగే వాపు, నొప్పి కూడా తగ్గుతాయి.
పంటి నొప్పి రావొద్దంటే ఏం చేయాలి?
- రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రి ఖచ్చితంగా పళ్లను తోముకోవాలి.
- చక్కెర పానీయాలను, ఆహారాలను ఎక్కువగా తినకూడదు. తీపి వల్ల పంటి నొప్పి వస్తుంది.
- మీరు ఏది తిన్నా వెంటనే నోటిని పుక్కిలించాలి.
- ఎక్కువ వేడిగా, మరీ చల్లగా ఉన్న ఆహారాలను తినకూడదు.
- ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా దంత పరీక్షలు చేయించుకోవాలి.
- పంటి నొప్పి కంటిన్యూగా మూడు రోజులకంటే ఎక్కువ రోజులు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
పంటి నొప్పిని తగ్గించడానికి ఆయిల్ పుల్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఆయుర్వేద, సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయిల్ పుల్లింగ్ వల్ల పంటి నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల దంతాలపై ఫలకం ఏర్పడటం తగ్గుతుంది. అలాగే చిగుళ్ల వాపు కూడా తగ్గుతుంది. అంతేకాదు కొబ్బరి నూనెతో పుక్కిలించడం వల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ కొబ్బరి నూనె వల్ల మీకు ఎలాంటి హాని జరగదు.
టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడి
టీ ట్రీ ఆయిల్ కూడా పంటి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. నేచురల్ గా పంటి నొప్పిని తగ్గించుకోవాలంటే టీ ట్రీ ఆయిల్ ను వాడండి. టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల దంతాలపై ఫలకం పేరుకుపోదు. అలాగే చిగుళ్ల వాపు కూడా తగ్గుతుంది. ఇందుకోసం మీరు టీ ట్రీ ఆయిల్ ఉన్న మౌత్ వాష్ లను ఉపయోగించండి.