
పేదరికం అనేది కేవలం డబ్బులు లేకపోవడమే కాదు. అది ఒక మనస్తత్వం, ఒక పరిస్థితి, కొన్నిసార్లు వారసత్వంగా వచ్చిన బాధ కూడా. చాలా మంది పేదరికం నుంచి బయటపడాలని కోరుకుంటారు. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియక దారితప్పుతారు. పేదరికం నుంచి బయటపడటానికి కష్టపడి పని చేస్తే సరిపోదు. మంచి ఆలోచన, సరైన దిశ, క్రమశిక్షణ, ఆర్థిక జాగ్రత్త వంటివి అవసరం. పేదరికం నుంచి బయటపడేందుకు తప్పకుండా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అన్నింటికంటే ముందు మన ఆలోచన మార్చుకోవాలి. పేదరికం మనసులో మొదలవుతుంది. “నాకది సాధ్యం కాదు”, “నా పరిస్థితి అలాగే ఉంటుంది” అనే ఆలోచనలను తొలగించాలి. దానికి బదులు “నేను ఏదైనా నేర్చుకోగలను”, నాకు అన్నీ సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని ఉపయోగించగల మార్గాలు వెతకాలి.
చాలా మంది తక్కువ ఆదాయం ఉన్నా, అవసరం లేని చోట ఖర్చు చేస్తుంటారు. ఫోన్ లు, బ్రాండెడ్ దుస్తులు, కాస్ట్లీ ఫుడ్ మొదలైనవి. ఆదాయం ఎంత తక్కువైనా, దానిలో కొంత భాగాన్ని సేవింగ్స్ కి కేటాయించడం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో తక్కువైనా, అది క్రమంగా ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుంది.
మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడేవారు, ప్రతి పనిలో నిరుత్సాహపరిచే వారికి దూరంగా ఉండాలి. ఎదగాలనే తపన ఉన్న వ్యక్తులతో కలవాలి. మనసుకు బలం ఇచ్చే వాతావరణం పేదరికం నుంచి బయటపడటానికి మంచి పునాది అవుతుంది.
ఎవరైనా విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం అవసరం. “ఏడాదికి ఎంత ఆదాయం పెంచుకోవాలి?”, “ఎన్ని నెలల్లో అప్పులు తీర్చాలి?”, “ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి?” అనే ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి. రాసుకున్న లక్ష్యాలు జీవితానికి దిశను చూపుతాయి. క్రమశిక్షణతో ఆ లక్ష్యాల దిశగా చిన్న చిన్న అడుగులు వేస్తే, పెద్ద మార్పులు తప్పకుండా కనిపిస్తాయి.
టెక్నాలజీ మార్పులతో అవకాశాలు మారుతున్నాయి. ఆన్‌లైన్ కోర్సులు, యూట్యూబ్ లెక్చర్లు, లేదా వర్క్‌షాప్స్ ద్వారా ఎవరైనా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, లేదా క్రాఫ్ట్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అలా కొత్తగా నేర్చుకున్న స్కిల్ ద్వారా ఆదాయం పొందవచ్చు. పేదరికం నుంచి బయటపడాలంటే నిరంతర అభ్యాసం తప్పనిసరి.
పేదరికంలో ఉన్నవారు ఎక్కువగా అప్పులు తీసుకునే అలవాటు కలిగి ఉంటారు. అవసరం లేని అప్పులు జీవితాన్ని బంధించేస్తాయి. అవసరమైన చోట మాత్రమే అప్పు తీసుకోవాలి. అది కూడా తిరిగి చెల్లించే ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి. అప్పులపై ఆధారపడకుండా ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆలోచించాలి.
శరీరం బలహీనమైతే, మనసు కూడా బలహీనమవుతుంది. మంచి ఆరోగ్యం లేకుండా సంపద సృష్టి అసాధ్యం. అలాగే సమయాన్ని వృథా చేయడం కూడా పేదరికాన్ని కొనసాగించే మార్గం. ఉదయాన్నే లేవడం, టైంకి నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రణాళిక ప్రకారం పనులు చేయడం వంటి అలవాట్లు జీవితాన్ని మారుస్తాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ఉద్దేశం ప్రజలకు ఆర్థిక బలం ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, వ్యాపార ప్రారంభానికి ప్రోత్సాహం ఇవ్వడం. కాబట్టి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అవి కూడా మన ఎదుగుదలకు సహాయపడవచ్చు.
ధైర్యం, ఓర్పు పేదరికం ఒక్క రోజులో రాదు, అలాగే దాని నుంచి బయటపడటం కూడా ఒక్క రోజులో జరగదు. కానీ క్రమంగా, పట్టుదలతో పనిచేస్తే ఫలితం తప్పక వస్తుంది. పేదరికం మన పరిస్థితి కావొచ్చు కానీ, మన భవిష్యత్తు కాదు. సరైన ఆలోచన, క్రమశిక్షణ, సేవింగ్స్, నేర్చుకునే ఉత్సాహం కలవారిని ఎవరూ ఆపలేరు.