నిమ్మకాయలు ఎక్కువగా పండే కాలంలో మార్కెట్లో సరఫరా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ధరలు తక్కువగా ఉంటాయి. కానీ సీజన్ ముగిసిన తర్వాత ఉత్పత్తి తగ్గిపోతుంది. సరఫరా తగ్గడం వల్ల నిమ్మకాయ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో నిమ్మరసం ఎక్కువగా ఉపయోగించే కారణంగా డిమాండ్ పెరుగుతుంది. అలాంటి సమయంలో ముందుగానే స్టోర్ చేసిన నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొన్ని మార్గాలున్నాయి.
24
ఎయిర్‌టైట్ డబ్బాల్లో నిమ్మరసం నిల్వ చేసే విధానం
తక్కువ కాలం కోసం నిమ్మరసం నిల్వ చేయాలంటే ఎయిర్‌టైట్ డబ్బాలు ఉపయోగించడం మంచిది. గాజు డబ్బాలు ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నిమ్మరసంలోని ఆమ్లం వల్ల రుచి మారదు. డబ్బాను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత నిమ్మరసం పోయాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా స్టోర్ చేస్తే నిమ్మరసం సుమారు 3 నుంచి 4 వారాల వరకు తాజాగా ఉంటుంది.
34
ఐస్ క్యూబ్స్‌లా ఫ్రీజ్ చేసి స్టోర్ చేసే విధానం
ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్స్‌లా ఫ్రీజ్ చేయడం ఉత్తమ పద్ధతి. ముందుగా నిమ్మరసం తీసి ఐస్ ట్రేల్లో పోయాలి. తర్వాత ఫ్రీజర్‌లో పెట్టాలి. క్యూబ్స్‌గా గడ్డకట్టిన తర్వాత వాటిని తీసి జిప్ కవర్లలో లేదా ఎయిర్‌టైట్ డబ్బాల్లో పెట్టాలి. ఇలా స్టోర్ చేసిన నిమ్మరసం సుమారు 3 నుంచి 4 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒకటి లేదా రెండు క్యూబ్స్ తీసుకుని వాడుకోవచ్చు. వేసవిలో ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
నిమ్మకాయలను పూర్తిగా నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్‌లో జిప్ కవర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. గది ఉష్ణోగ్రతలో పెట్టాలంటే ఎండ తగలకుండా చల్లటి ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచితే సుమారు ఒక వారం వరకు నిల్వ ఉంటాయి. ముందుగానే నిమ్మరసం తీసి స్టోర్ చేసుకోవడం వల్ల వేసవిలో నిమ్మకాయలు ఖరీదైనప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. అవసరమైనప్పుడు వెంటనే ఉపయోగించుకోవచ్చు.