Lemon Idli: బ్రేక్ ఫాస్ట్ లో ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ తింటే ఎలా? ఒకసారి కొత్తగా లెమన్ ఇడ్లీ ప్రయత్నించండి. కొబ్బరి చట్నీలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది
వారంలో ఐదారు రోజులు ఇడ్లీ తినే వారే ఎక్కువ. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇడ్లీని మరింత పోషకాల నిలయంగా మార్చేందుకు నిమ్మకాయని చేర్చి లెమన్ ఇడ్లీ ప్రయత్నించండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలనుండి పెద్దల వరకు దీన్ని ఇష్టంగా తింటారు. టమోటో చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా దేనితో తిన్నా ఇది అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
25
లెమన్ ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు
లెమన్ ఇడ్లీ చేసేందుకు ముఖ్యంగా ఇడ్లీ రవ్వ అవసరం పడుతుంది. కాబట్టి ఒక కప్పు ఇడ్లీ రవ్వ, అర కప్పు పెరుగు, అరకప్పు నీరు సిద్ధం చేసుకోండి. అలాగే నూనె ఒక స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా అర స్పూను, కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు, అల్లం తరుగు ఒక స్పూను, పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు, నిమ్మరసం రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లెమన్ ఇడ్లీ చేసేందుకు సిద్ధమైపోండి.
35
లెమన్ ఇడ్లీ రెసిపీ ఇదిగో
లెమన్ ఇడ్లీ చేసేందుకు ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వను వేయండి. అందులో నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టండి. రవ్వ బాగా నానితేనే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. ఈ లోపు మరొక గిన్నె తీసుకొని అందులో పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆ మిశ్రమంలోనే పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు నానబెట్టిన రవ్వను పిండిని తీసి పెరుగు మిశ్రమంలో కలపండి. ఇది మొత్తం పెరుగు మిశ్రమంలో వేసుకున్నాక బాగా కలుపుకోండి. వంటసోడా కూడా వేసి బాగా కలపండి. అవసరమైతే నీరు కూడా వేయండి.
ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కొద్దిగా నూనె రాసి ఈ ఇడ్లీ పిండిని ఇడ్లీల్లా వేసుకోండి. పావుగంట పాటు ఆవిరిపై ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక ఆవిరి పోయేదాకా ఒక 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత ఓపెన్ చేస్తే లెమన్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా వస్తుంది. వీటిని చికెన్ కర్రీతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. లేదా కొబ్బరి చట్నీ అని కూడా చేసుకోవచ్చు. మీకు అవసరం అనిపిస్తే ఇందులో కరివేపాకును కూడా వేసుకోండి. ఏదేమైనా సాధారణ ఇడ్లీతో పోలిస్తే లెమన్ ఇడ్లీ పుల్లగా రుచిగా కొత్తగా అనిపిస్తుంది. పిల్లలకు ఒక్కసారి ఈ లెమన్ ఇడ్లీ చేసి పెట్టండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది.
55
నిమ్మరసంలో ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మరసం చాలా అవసరం. లెమన్ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు మరింత ఆరోగ్యంగా ఎదుగుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఈ లెమన్ ఇడ్లీ ఎంతో మంచిది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడడంలో ఈ ఇడ్లీ ఉపయోగపడుతుంది. నిమ్మరసం మన రోజువారి విటమిన్ సి అవసరాన్ని కూడా తీరుస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మన ఇడ్లీ చేసుకొని తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.