అన్నం వండే పద్దతి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడతారు. ఇంకొందరు ప్రెషర్లో కుక్కర్లో వండుతారు. మరికొందరు పాత పద్ధతిలో బియ్యంలో నీళ్లు ఎక్కువ వేసి అన్నం ఉడికాక నీటిని వార్చుతారు. ఏ పద్ధతిలో వండితే అన్నంలోని పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి? అనే సందేహం ఎక్కువ మందికి ఉంటుంది.
ఎక్కువ నీళ్లలో ఉడికించి వార్చితే పిండిపదార్థం (స్టార్చ్) తగ్గిపోతుందని, అది ఆరోగ్యానికి మంచిదని చాలామంది అంటుంటారు. అలాగే, కుక్కర్‌లో వండిన అన్నం తింటే షుగర్ వేగంగా పెరుగుతుందనే అపోహ కూడా ఉంది. కానీ మనం ఏ రకం బియ్యం వాడుతున్నాం, ఎంత నీరు పోస్తున్నాం, ఎంతసేపు వండుతున్నాం, వండిన వెంటనే తింటున్నామా లేదా చల్లారాక తింటున్నామా అనే విషయాలు అన్నం స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
బియ్యం రకం, ప్రాసెస్ చేసే విధానం, వండే పద్ధతి, నిల్వ చేసి మళ్లీ వేడి చేయడం లాంటివి తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఎంత వేగంగా పెరుగుతుందనే దాన్ని మారుస్తాయని పరిశోధనల్లో తేలింది. అందుకే కుక్కర్ అన్నం చెడ్డది, వార్చిన అన్నమే మంచిది అని ఒకే మాటలో తేల్చి చెప్పలేం. కానీ ఈ రెండు పద్ధతుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.