శ్రీనగర్‌లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్‌లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్‌బోట్‌లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు.
డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు.
ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు.
పోస్టులు గమ్యస్థానాలకు ఎలా చేరతాయి?
ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్‌బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు.