Hibiscus Shampoo: జుట్టు బలంగా, మెరిసేలా పెరగాలంటే ఇంట్లోనే మందారపూలతో షాంపూ తయారుచేసుకోవచ్చు. ఈ షాంపూ జుట్టును మృదువుగా మారుస్తుంది. ఇంట్లో దీన్ని ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన షాంపూలు, హెయిర్ కేర్ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే మన ఇంటి దగ్గరే దొరికే మందార పూలతో కూడా షాంపూ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మందార పూలు, ఆకులు జుట్టు సంరక్షణలో చాలాకాలంగా వాడుతున్నారు. వీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, జుట్టును మృదువుగా ఉంచే సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టును శుభ్రం చేయడంతో పాటు మృదువుగా, మెరుస్తూ ఉండేందుకు తోడ్పడవచ్చు. ఇంట్లోనే ఈ షాంపూను తయారు చేసుకోవడానికి ఎక్కువ వస్తువులు అవసరం లేదు. 4 నుంచి 5 మందార పూలు, 8 నుంచి 10 మందార ఆకులు, రెండు చెంచాల పెసరపిండి లేదా శీకాకాయ పొడి, ఒక చెంచా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా నీళ్లు సిద్ధం చేసుకోవాలి.
23
మందార పూల షాంపూ తయారీ ఇలా
ముందుగా మందార పూలు, ఆకులను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో పూలు, ఆకులు వేయాలి. వీటిని మధ్యస్థ మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక పూలు, ఆకులను చేతులతో బాగా నలపాలి. తర్వాత వడకట్టి ద్రవాన్ని తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల పెసరపిండి లేదా శీకాకాయ పొడి, ఒక చెంచా కొబ్బరి నూనె కలపాలి. అన్నింటినీ బాగా కలిపితే ఇంట్లో తయారుచేసిన మందార షాంపూ సిద్ధమవుతుంది. కావాలంటే మందార పూలు, ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పేస్ట్‌లా కూడా చేసుకోవచ్చు.
33
మందార షాంపూని ఎలా వాడాలి?
ఈ షాంపూను వాడే ముందు జుట్టును నీళ్లతో తడపాలి. తర్వాత తయారుచేసిన మిశ్రమాన్ని తలపై, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసి 3 నుంచి 5 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఈ షాంపూతో మార్కెట్లో దొరికే షాంపూలా ఎక్కువ నురుగు రాదు. అయినా జుట్టును శుభ్రం చేయడంలో తోడ్పడుతుంది. మందార పూల మిశ్రమం జుట్టును మృదువుగా, మెరుస్తూ ఉంచేందుకు సహాయపడవచ్చు. అయితే జుట్టు రాలడం, చుండ్రు తగ్గడం, జుట్టు పెరగడం విషయంలో అందరికీ ఒకే ఫలితం ఉండదు. మొదటిసారి వాడే ముందు కొద్దిగా చర్మంపై పరీక్షించాలి. అలర్జీ ఉంటే వాడకూడదు. ఇందులో నిల్వ ఉంచే పదార్థాలు ఉండవు కాబట్టి తయారుచేసిన రోజే వాడటం మంచిది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడవచ్చు