Amla Hair oil: జుట్టు రాలకుండా ఆపే ఉసిరి నూనెను ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి

Published : Dec 16, 2025, 04:46 PM IST

Amla Hair oil: జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఉసిరినూనెను వాడితే మంచిది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. నాలుగు ఉసిరికాయలు ఉంటే చాలు నూనె సిద్ధమైపోతుంది. 

PREV
14
జుట్టు రాలకుండా అడ్డుకునే ఉసిరి

జుట్టు రాలడం, పలుచగా మారడం, తెల్లబడటం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇంతలా జుట్టు రాలడానికి కారణం జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్ ఉత్పత్తుల వినియోగం అని చెప్పుకుంటారు. అయితే వెంట్రుకలు రాలకుండా అడ్డుకునే శక్తి ఉసిరికాయకు ఉంది. ఉసిరి కాయతో హెయిర్ ఆయిల్ చేసి తలకు పట్టిస్తే కొన్ని రోజుల్లోనే వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది. ఉసిరి ఆయిల్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. 

ఈ నూనె జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల చర్మానికి మంచి పోషణను అందించి జుట్టు మూలాలను బలపరుస్తాయి. అందుకే పూర్వకాలం నుంచే పెద్దలు ఉసిరిని జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తూ వచ్చారు. మార్కెట్‌లో దొరికే నూనెల్లో కెమికల్స్ ఉండే అవకాశం ఉండటంతో ఇలా ఇంట్లో తయారు చేసిన ఉసిరి ఆయిల్‌నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

24
ఉసిరి ఆయిల్ తయారీ ఇలా

ఇంట్లో ఉసిరి హెయిర్ ఆయిల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు చాలా సులభంగా దొరుకుతాయి. తాజా ఉసిరి కాయలు, కొబ్బరి నూనె, మెంతులు, కరివేపాకు, నల్ల జీలకర్రను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఉసిరిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఒక పాత్రలో కొబ్బరి నూనె వేసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉసిరి ముక్కలు, మెంతులు, కరివేపాకు, నల్ల జీలకర్ర వేసి మెల్లగా మరిగించాలి. 

ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై కొంతసేపు ఉంచితే ఉసిరిలోని పోషకాలు నూనెలోకి వస్తాయి. ఉసిరి ముక్కలు నల్లగా మారే వరకు ఉంచి తర్వాత గ్యాస్ ఆపేయాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఉసిరి హెయిర్ ఆయిల్‌ను నెల రోజుల వరకు వాడుకోవచ్చు.

34
ఉసిరి ఆయిల్ తో లాభాలు

ఈ ఉసిరి హెయిర్ ఆయిల్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు మూలాలు బలంగా మారతాయి. దీంతో కొత్త జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే జుట్టు మందంగా, పొడవుగా పెరగడంలో ఈ నూనె సహాయపడుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్యను కూడా కొంతవరకు తగ్గించగల శక్తి ఈ నూనెకు ఉందని నిపుణులు చెబుతున్నారు.

44
చుండ్రు పోతుంది

చుండ్రు, తల దురద వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఈ నూనె ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో ఉన్న యాంటీ ఫంగల్ లక్షణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. జుట్టుకు సహజమైన మెరుపు, మృదుత్వం రావడంలో కూడా ఇది సహాయపడుతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. నూనె రాసిన తర్వాత కనీసం ఒక గంట లేదా రాత్రంతా ఉంచి ఉదయం మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories