Green Chilli Plant in Pot: ఇంటి బాల్కనీ లేదా మిద్దెపై పచ్చిమిర్చి మొక్కలను పెంచాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. మిరప విత్తనాలు నాటడం నుంచి గుత్తుగుత్తులుగా కాయలు కాసేవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మనం రెగ్యులర్ గా వంటల్లో వాడే పచ్చిమిర్చిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. బాల్కనీ లేదా మిద్దె తోటలోని చిన్న కుండీల్లో కూడా ఇది మంచిగా పెరుగుతుంది. ఒక చిన్న కుండీ, కొన్ని విత్తనాలు, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కొద్ది నెలల్లోనే ఎలాంటి రసాయనాలు లేని ఆర్గానిక్ పచ్చిమిర్చిని పొందవచ్చు.
25
నాణ్యమైన విత్తనాలు
ఆరోగ్యకరమైన మొక్కకు నాణ్యమైన విత్తనాలే పునాది. నర్సరీలో విత్తనాలు కొనొచ్చు లేదా ఇంట్లోని ఎండుమిర్చి విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ఒక చిన్న కప్పులో విత్తనాలు చల్లి, మట్టి తడిచేలా నీళ్లు చల్లాలి. వారంలోపే చిన్న మొలకలు వస్తాయి.
వేర్లు స్వేచ్ఛగా పెరిగేందుకు కనీసం 12 అంగుళాల లోతు ఉన్న కుండీని తీసుకోవాలి. నీరు నిలిచిపోకుండా 50% తోట మట్టి, 30% కంపోస్ట్ ఎరువు లేదా పశువుల ఎరువు, 20% ఇసుక లేదా కోకోపీట్ కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
35
మొలకలు నాటడం
మొలకలు 4 నుంచి 5 అంగుళాల ఎత్తు పెరిగాక, వాటిని జాగ్రత్తగా తీసి పెద్ద కుండీలోకి మార్చాలి. వేర్లు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మొక్క బాగా పెరగడానికి ఒక కుండీలో ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే నాటాలి.
పచ్చిమిర్చి మొక్క ఎక్కువగా కాయాలంటే ఎండ చాలా అవసరం. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట కుండీని ఉంచాలి. బాల్కనీ, టెర్రస్ లేదా కిటికీ పక్కన పెట్టొచ్చు. ఎండ సరిగ్గా తగలకపోతే పూలు రాలిపోతాయి.
మట్టిలో ఎప్పుడూ కాస్త తేమ ఉండాలి, కానీ మరీ ఎక్కువగా నీళ్లు పోయకూడదు. నీరు ఎక్కువగా నిలిచిపోతే వేర్లు కుళ్లిపోతాయి. అలాగని మట్టి పూర్తిగా ఎండిపోతే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి, మట్టి పైపొర ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి.
55
పచ్చిమిర్చి ఎక్కువగా కాయాలంటే?
మొక్క కాస్త పెరిగాక, దాని పైభాగాన్ని తుంచేయాలి. దీన్నే 'పించింగ్' అంటారు. ఇలా చేయడం వల్ల మొక్క నిలువుగా కాకుండా పక్క కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. కొమ్మలు పెరిగితే పూలు ఎక్కువై, మిర్చి గుత్తులు గుత్తులుగా కాస్తుంది. పచ్చిమిర్చికి ఆకుముడత తెగులు, చిన్న పురుగులు రావడం సహజం.
రసాయన మందులు వాడకుండా, వారానికోసారి నీళ్లలో వేపనూనె కలిపి ఆకులపై స్ప్రే చేయాలి. బాగా పులిసిన మజ్జిగను కూడా నీళ్లలో కలిపి చల్లొచ్చు. ఇవి పురుగులను తరిమికొట్టడమే కాకుండా, పూలు రాలిపోకుండా ఆపుతాయి.