Relationship: ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉండేది అమ్మ. అలాంటి అమ్మతో కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాలకే కఠినంగా మాట్లాడుతుంటాం. కానీ అమ్మతో పొరపాటున కూడా అనకూడని కొన్ని మాటలున్నాయి. అవేంటో చూద్దాం.
మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి అమ్మే. మనం బాధలో ఉంటే తన మనసు విలవిల్లాడుతుంది. మనం సంతోషంగా ఉంటే తాను పండగ చేసుకుంటుంది. అలాంటి అమ్మను కొన్నిసార్లు మనం కోపంలోనో, చిరాకులోనో నోటికి వచ్చిన మాటలు అనేస్తుంటాం. ఆ సమయంలో మనకు అవి సాధారణ మాటలుగానే అనిపించవచ్చు. కానీ అవి అమ్మ మనసును ఎంతగానో బాధిస్తాయి. మరి అమ్మతో మాట్లాడేటప్పుడు అస్సలు అనకూడని ఆరు మాటలేంటో తెలుసుకుందాం.
27
నాకేం చేశావని?
పిల్లల కోసం అమ్మ చేసే త్యాగాలను మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మనం కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెద్దయ్యే వరకు ఎన్నో కష్టాలను భరిస్తుంది. తన నిద్రను, విశ్రాంతిని, ఇష్టాలను పక్కనపెట్టి పిల్లల అవసరాల కోసం నిరంతరం శ్రమిస్తుంది. అలాంటి అమ్మతో ఏదైనా గొడవ వచ్చినప్పుడు 'నాకేం చేశావని?' అని అనడం అస్సలు మంచిది కాదు. అమ్మ చేసిన ప్రతి పనిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ, ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడటం ఆమెను తీవ్రంగా బాధిస్తుంది.
37
నీకేం తెలుసు?
పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక చదువు, ఉద్యోగం, లైఫ్ స్టైల్ విషయంలో తల్లిదండ్రుల కంటే తమకే ఎక్కువ తెలుసని భావిస్తుంటారు. ముఖ్యంగా అమ్మ ఏదైనా సలహా ఇస్తే 'నీకేం తెలుసు?' అంటూ కొట్టిపారేస్తుంటారు. నిజమే.. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. జీవన విధానాలు మారిపోయాయి. అమ్మకు మనకు తెలిసిన ప్రతి విషయం తెలియకపోవచ్చు. కానీ జీవితాన్ని చూసిన అనుభవం ఆమెకు ఉంటుంది. మన మంచిని కోరే ఉద్దేశంతోనే ఏదైనా చెబుతుంది. ఆమె చెప్పిన ప్రతిదీ సరైనదే కావాలని లేదు. కానీ ఆమె అభిప్రాయాన్ని వినకుండా అవమానించడం మాత్రం తప్పు. ఏదైనా విషయం నచ్చకపోతే ప్రశాంతంగా వివరించడం మంచిది.
పిల్లలు పెద్దయ్యాక తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకోవాలనుకోవడం సహజం. ఏం చదవాలి? ఎలాంటి ఉద్యోగం చేయాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి? వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే ఆ నిర్ణయాల గురించి అమ్మ అడిగినప్పుడు 'నా ఇష్టం.. నీకెందుకు?' అని సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. అమ్మ మన జీవితంలోని ప్రతి విషయాన్ని నియంత్రించాలని అనుకోకపోవచ్చు. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోవాలనే ఆరాటం ఆమెకు ఉంటుంది. కాబట్టి మన నిర్ణయాన్ని గౌరవించమని కోరే ముందు ఆమె భావాలను కూడా గౌరవించడం మనం నేర్చుకోవాలి.
57
నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
పిల్లలు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అమ్మ తనకు తెలిసిన పరిష్కారాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు మనకు ఆమె సలహాలు అవసరం లేకపోవచ్చు. అలాంటప్పుడు 'నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు' అని చిరాకుగా మాట్లాడుతుంటాం. కానీ అమ్మ సలహా వెనుక చాలాసార్లు తన పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచన ఉంటుంది. ఆమె చెప్పిన ప్రతిదాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, ఓపికగా వినడం మంచిది.
67
నా దగ్గర టైం లేదు
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర పనులతో చాలామందికి తీరిక లేకుండా పోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఇలాంటి సమయంలో అమ్మ ఫోన్ చేసినా, మాట్లాడాలని ప్రయత్నించినా కొందరు 'టైం లేదు' బిజిగా ఉన్న అంటూ ఫోన్ పెట్టేస్తుంటారు. నిజంగానే మనకు పనులు ఉండవచ్చు. కానీ రోజులో కనీసం ఐదు, పది నిమిషాలైనా అమ్మతో మాట్లాడటం మంచిది.
77
నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా?
అమ్మ ప్రేమతో పలకరించినా, ఏదైనా విషయం అడిగినా కొన్నిసార్లు పిల్లలకు చిరాకు వస్తుంటుంది. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె అడిగే ప్రశ్నలు ఇబ్బందిగా అనిపించవచ్చు. అప్పుడు 'నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా?' అంటూ విసుక్కుంటారు. నిజానికి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కొంత సమయం ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ విషయాన్ని అమ్మకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆమెను దూరం పెట్టినట్లుగా మాట్లాడకూడదు. మన మనసుకు ప్రశాంతత ఎంత అవసరమో, అమ్మ మనసుకు మన ప్రేమ, పలకరింపు కూడా అంతే అవసరమనే విషయాన్ని పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడదు.