వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. దీంట్లో వంట తొందరగా అవుతుంది కాబట్టి.. చాలామంది దీన్ని వాడటానికి ఇష్టపడతారు. అయితే కుక్కర్ విజిల్ సరిగ్గా రాకపోతే వంట పాడవుతుంది. ఈ సమస్యకు పైసా ఖర్చు లేకుండా చెక్ ఎలా పెట్టాలో చూద్దాం.
ప్రెషర్ కుక్కర్ లో వంట ఎంత ఫాస్ట్ గా అవుతుందో మనకు తెలుసు. అయితే అది సరిగ్గా పనిచేయకపోతే మాత్రం అంతకంటే ఎక్కువే లేట్ అవుతుంది. పైగా వంట కూడా పాడవుతుంది. ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే కుక్కర్ విజిల్ సరిగ్గా పనిచేయకపోవడం. అంటే కొన్నిసార్లు విజిల్ రావడం ఆలస్యం అవుతుంది, ఇంకొన్ని సార్లు అసలే రాదు. నిజానికి ఈ సమస్యకు కారణం చాలా చిన్నది. పైసా ఖర్చు లేకుండా ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
27
విజిల్ లోపలే సమస్య..
ప్రెషర్ కుక్కర్ విజిల్ పని చేయాలంటే లోపల ప్రెషర్ సరిగ్గా ఏర్పడాలి. ఆ ప్రెషర్ బయటకు నియంత్రితంగా వెళ్లే మార్గమే విజిల్. కాబట్టి విజిల్ పనిచేయకపోతే కుక్కర్ పాడైంది అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో సమస్య విజిల్ లోపలే ఉంటుంది. రోజూ వాడటం వల్ల చిన్న చిన్న ఆహార కణాలు విజిల్ లోపల అంటుకుపోతాయి. దాంతో ఆవిరి బయటకు వెళ్లే మార్గం బ్లాక్ అవుతుంది. దీన్ని సరిచేయడానికి విజిల్‌ను తీసి, వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి, సూది లేదా టూత్‌పిక్ సహాయంతో లోపలి రంధ్రాన్ని శుభ్రం చేయాలి. చాలామందికి ఈ చిన్న పని చేసిన వెంటనే విజిల్ సరిగ్గా పనిచేస్తుంది.
37
ఆవిరి వెళ్లే పైపు క్లీన్ చేయడం
మరొక ముఖ్యమైన కారణం.. కుక్కర్ మూతలో ఉన్న ఆవిరి వెళ్లే పైపు బ్లాక్ కావడం. ఇది బయటకు కనిపించదు కాబట్టి చాలామంది గమనించరు. మూత తీసి, ఆ పైపును ఒక చిన్న వైర్ లేదా సేఫ్టీ పిన్‌తో మెల్లగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లోపల ఉన్న మలినాలు బయటకు వస్తాయి, ప్రెషర్ సరిగ్గా విడుదల అవుతుంది.
విజిల్ సమస్యకు మరో ప్రధాన కారణం కుక్కర్ మూత చుట్టూ ఉండే రబ్బరు రింగ్(గాస్కెట్). అది గట్టిగా అయిపోయినా, సరిగ్గా అమరకపోయినా లోపల ప్రెషర్ నిలవదు. అప్పుడు విజిల్ రావడం ఆలస్యం అవుతుంది. లేదా అసలే రాదు. కాబట్టి ఆ గాస్కెట్ ని తీసి గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తర్వాత సరిగ్గా అమర్చితే సరిపోతుంది.
57
సరిపడా నీరు లేకపోయినా..
కుక్కర్‌లో నీరు తక్కువగా ఉన్నా ఆవిరి సరిగ్గా ఏర్పడదు. దాంతో విజిల్ పనిచేయదు. అలాగే ఎక్కువగా నింపినా ఇదే సమస్య వస్తుంది. కుక్కర్‌లో ఎప్పుడూ సూచించిన స్థాయి వరకే నీళ్లు, పదార్థాలు వేయాలి. ఇది కేవలం విజిల్ కోసమే కాదు, భద్రత కోసం కూడా చాలా అవసరం.
67
మీడియం ఫ్లేమ్ పై..
గ్యాస్ మంట కూడా విజిల్‌పై ప్రభావం చూపుతుంది. లో ఫ్లేమ్ పై కుక్కర్ పెడితే ప్రెషర్ ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే హై ఫ్లేమ్ పై పెడితే లోపల ఆవిరి అనవసరంగా ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పై పెట్టాలి. విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించడం ఉత్తమం.
77
మూత సరిగ్గా లాక్ కాకపోయినా..
కుక్కర్ మూత సరిగ్గా లాక్ కాకపోయినా కూడా విజిల్ పనిచేయదు. మూత పెట్టేటప్పుడు క్లిక్ సౌండ్ వచ్చేలా సరిగ్గా అమర్చామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కుక్కర్ ని కాస్త శ్రద్ధగా శుభ్రం చేయడం, సరైన విధంగా వాడటం నేర్చుకుంటే, పైసా ఖర్చు లేకుండా సమస్యను పరిష్కరించవచ్చు.