
ఈ మధ్య అల్యూమినియం పాత్రల కంటే వంటగదిలో స్టీల్ గిన్నెలకే చాలామంది ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎక్కువ కాలం మన్నికగా ఉండటం, సులభంగా శుభ్రం చేసుకోవడం వల్ల వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కానీ షాపుకి వెళ్లి స్టీల్ గిన్నెలు కొనేటప్పుడు దాని ధర, బరువు, మెరుపు, డిజైన్ మాత్రమే ఎక్కువ మంది చూస్తారు. నిజానికి ఆ గిన్నెలు ఏ నాణ్యతతో తయారయ్యాయి, వంటకు అనుకూలమైనవేనా, లోపల, అడుగు భాగం కరెక్ట్ గా ఉందా అనేది గమనించడం ముఖ్యం. ముఖ్యంగా, ఒకేలా కనిపించే రెండు స్టీల్ గిన్నెల మధ్య నాణ్యత, తయారీ విధానంలో తేడాలు ఉండొచ్చు. దీన్ని ఎలా గుర్తించాలి?
స్టీల్ గిన్నెల నాణ్యత గురించి తెలుసుకోవడానికి ముందుగా చూడాల్సింది BIS స్టాండర్డ్ సర్టిఫికేట్, ISI మార్క్. భారతదేశంలో స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెల స్టాండర్డ్ గా IS 14756:2024 అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2025 క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం, స్టీల్ గిన్నెలకు BIS లైసెన్స్‌తో పాటు స్టాండర్డ్ మార్క్ ఉండాలి. అందుకే, గిన్నెలు కొనేటప్పుడు దాని అడుగు భాగంలో ISI మార్క్ ఉందో లేదో గమనించండి. అలాగే తయారీదారు వివరాలు, లైసెన్స్ నంబర్ లాంటివి కూడా చెక్ చేసుకోవాలి.
కేవలం ISI మార్క్ చూసి నిర్ణయించుకోకుండా, ఆ లైసెన్స్ నిజమైనదేనా అని BIS అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.
స్టీల్ గిన్నెలు కొనేటప్పుడు చాలామంది చేసే మొదటి టెస్ట్ అయస్కాంతంతోనే. గిన్నెకు అయస్కాంతం అతుక్కుంటే నాణ్యత లేనిదని, అతుక్కోకపోతే నాణ్యమైనదని అనుకుంటారు.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు.
304, 202, 430 లాంటి స్టెయిన్‌లెస్ స్టీల్ రకాల్లో అయస్కాంత తత్వం వేర్వేరుగా ఉండొచ్చు. అంతేకాకుండా, గిన్నెలు తయారు చేసే విధానం, డిజైన్‌లో చేసే మార్పుల వల్ల కూడా అయస్కాంత ఆకర్షణ మారొచ్చు.
కాబట్టి, అయస్కాంతం అతుక్కున్నంత మాత్రాన గిన్నెలో కల్తీ జరిగిందని, అతుక్కోనంత మాత్రాన అది హై క్వాలిటీ అని నిర్ణయించుకోకూడదు.
అయస్కాంత పరీక్ష అనేది ఒక చిన్న సూచన మాత్రమే; నాణ్యతను నిర్ధారించే పరీక్ష కాదు.
స్టీల్ గిన్నె అడుగు భాగం దాని పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా, అడుగు భాగం సమానంగా ఉందా, అనవసరమైన ఎత్తుపల్లాలు ఉన్నాయా, గిన్నె అడుగు భాగం, బాడీకి మధ్య అతుకు గట్టిగా ఉందా అనేది చూడండి.
కొన్ని గిన్నెలలో వేడి సమానంగా వ్యాపించడానికి అల్యూమినియం లేదా ఇతర లోహాలతో చేసిన లేయర్లు వాడుతారు. దీన్ని 3-ply లేదా మల్టీ-లేయర్ సిస్టమ్ అంటారు.
ఇలాంటి గిన్నెల్లో లేయర్లు కరెక్ట్ గా జాయింట్ చేశారా అనేది కూడా ముఖ్యం. కేవలం అడుగు భాగం మందంగా ఉన్నంత మాత్రాన క్వాలిటీని డిసైడ్ చేయలేం.
షాపుల్లో తళతళలాడే గిన్నెలను చూడగానే చాలామంది వాటిని కొనాలని అనుకుంటారు. కానీ బయటకు కనిపించే మెరుపు మాత్రమే నాణ్యతకు గుర్తు కాదు.
కొనే ముందు ఈ కింద వాటిని గమనించండి:
• లోపల తుప్పు పట్టిన మచ్చలు లేదా గుంతలు ఉండకూడదు.
• ఉపరితలంపై లోతైన గీతలు ఉండకూడదు.
• పదునైన అంచులు ఉండకూడదు.
• చదునైన ప్రదేశంలో పెట్టినప్పుడు గిన్నె ఊగకూడదు.
• హ్యాండిల్స్ గట్టిగా బిగించి ఉండాలి.
ఈ ఫీచర్లు గిన్నె తయారీ, ఫినిషింగ్ నాణ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
స్టీల్ గిన్నెలు కొనేటప్పుడు 304 గ్రేడ్ అనే పేరును తరచుగా చూస్తుంటాం. చాలామంది దీన్ని హై క్వాలిటీ స్టీల్ అని అనుకుంటారు.
304 అనేది ఒక నిర్దిష్ట రకమైన స్టెయిన్‌లెస్ స్టీల్. ఇందులో నికెల్, క్రోమియం లాంటి మూలకాలు ఉంటాయి. కానీ అన్ని నాణ్యమైన స్టీల్ గిన్నెలు 304 రకానికి చెందినవై ఉండాలనే రూల్ ఏమీ లేదు.
భారతీయ స్టాండర్డ్ IS 14756:2024 ప్రకారం గిన్నెలకు ముడిసరుకుగా IS 5522 లేదా IS 15997 స్టాండర్డ్స్ కు తగిన స్టీల్‌ను వాడాలని పేర్కొన్నారు.
కాబట్టి, కేవలం 304 అని రాసి ఉన్నంత మాత్రాన గిన్నె నాణ్యతను నిర్ధారించలేం. నమ్మకమైన తయారీదారు, సరైన క్వాలిటీ సర్టిఫికేట్, ప్రొడక్ట్ వివరాలను కూడా చెక్ చేసుకోవాలి.
స్టీల్ గిన్నె కొనేటప్పుడు దాని బరువు, మందాన్ని గమనించడం మంచిది. ఒకే సైజులో ఉన్న రెండు గిన్నెల్లో ఒకటి చాలా తేలికగా, మరొకటి గట్టిగా ఉండొచ్చు.
కానీ బరువుగా ఉంటేనే నాణ్యమైనది అని అర్థం కాదు. గిన్నె సైజు, డిజైన్, వాడిన లోహం రకం, అడుగు భాగం నిర్మాణాన్ని బట్టి బరువు మారుతుంది.
ముఖ్యంగా, గిన్నె అంచులు చాలా పల్చగా ఉన్నాయా, అడుగు భాగం సమానంగా ఉందా, హ్యాండిల్స్ గట్టిగా ఉన్నాయా అనేది గమనించండి. ఒకే సైజు గిన్నెలను పోల్చి చూసి కొనడం ఉత్తమం.
చాలామందికి ఉండే ముఖ్యమైన అనుమానం ఇది. స్టీల్ గిన్నెకు అయస్కాంతం పెట్టి చూడటం, దాని రంగును గమనించడం, తట్టి చూసి సౌండ్ వినడం లాంటి పద్ధతులు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
కానీ వీటిలో ఏదీ లోహం అసలు మిశ్రమాన్ని నిర్ధారించే పరీక్ష కాదు.
అయస్కాంతం అతుక్కుంటుందో లేదో చూడొచ్చు. కానీ దీని ద్వారా స్టీల్ నాణ్యతను నిర్ధారించలేం. తుప్పు పట్టిన మచ్చలు, గుంతలు, లోతైన గీతలు ఉన్నాయా అని చూడొచ్చు. చదునైన ప్రదేశంలో గిన్నె సమానంగా నిలబడుతుందా అని గమనించొచ్చు. హ్యాండిల్ కదులుతుందా, కనెక్షన్లు గట్టిగా ఉన్నాయా అని గమనించొచ్చు. ISI మార్క్, BIS లైసెన్స్ వివరాలను చెక్ చేయొచ్చు.
లోహం అసలు నాణ్యత, మిశ్రమం, అందులో వాడిన మూలకాల పరిమాణాన్ని తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్ట్ మాత్రమే నమ్మదగిన మార్గం. అందుకే, ఇంట్లో యాసిడ్, కెమికల్స్ లాంటివి వాడి టెస్ట్ చేయడానికి ప్రయత్నించకండి.
1. ధర తక్కువగా ఉందని గిన్నెలను కొనకండి.
2. మెరుస్తుందనే కారణంతో దాన్ని నాణ్యతకు గుర్తుగా అనుకోకండి.
3. అయస్కాంతం అతుక్కోలేదని దాన్ని 304 గ్రేడ్ అని డిసైడ్ అవ్వకండి.
4. తయారీదారు వివరాలు లేని గిన్నెలను కొనడం మానుకోండి.
5. ISI మార్క్ నకిలీదా కాదా అని చెక్ చేయకుండా కొనకండి.
నాణ్యమైన స్టీల్ గిన్నె అయినా సరే సరైన పద్ధతిలో వాడుకోకపోతే దాని రూపురేఖలు దెబ్బతింటాయి.
• వంట చేసిన తర్వాత గిన్నెను శుభ్రం చేసి ఆరబెట్టాలి.
• ఉప్పు నీరు లేదా పుల్లటి ఆహారాలను ఎక్కువ సేపు గిన్నెలో ఉంచకూడదు.
• గట్టి ఇనుప పీచుతో గీరడం మానుకోవాలి.
• గిన్నెలో ఆహారం అంటుకుంటే కొద్దిసేపు నీళ్లలో నానబెట్టి శుభ్రం చేయాలి.
• ఎక్కువ సేపు తడిగా ఉంచకూడదు.
1. స్టీల్ గిన్నెకు అయస్కాంతం అతుక్కుంటే కల్తీయేనా?
అలా చెప్పలేం. కొన్ని రకాల స్టెయిన్‌లెస్ స్టీల్‌లో అయస్కాంత ఆకర్షణ ఉంటుంది. కాబట్టి అయస్కాంత పరీక్ష మాత్రమే నాణ్యతను నిరూపించదు.
2. 304 స్టీల్ గిన్నెనే బెస్ట్ ఆ?
304 అనేది ఒక నిర్దిష్ట రకమైన స్టెయిన్‌లెస్ స్టీల్. కానీ నాణ్యమైన గిన్నె అనడానికి 304 అనే పేరు మాత్రమే సరిపోదు. దానికి వర్తించే ఇండియన్ స్టాండర్డ్స్, తయారీ నాణ్యతను కూడా గమనించాలి.
3. స్టీల్ గిన్నె తుప్పు పడితే ఏం చేయాలి?
ముందుగా ఆ గిన్నెను వాడటం ఆపేసి, తుప్పు పట్టిన ప్రాంతాన్ని శుభ్రం చేసి దాని పరిస్థితిని చూడండి. లోతైన గుంతలు, వరుసగా తుప్పు పట్టడం లేదా సర్ఫేస్ డ్యామేజ్ అయితే గిన్నెను మార్చడం మంచిది.
4. ISI మార్క్ అసలుదా కాదా ఎలా తెలుసుకోవాలి?
BIS అధికారిక వెబ్‌సైట్ లేదా BIS Care యాప్ ద్వారా ప్రొడక్ట్ లైసెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. మార్క్‌పై ఉన్న లైసెన్స్ నంబర్, ప్రొడక్ట్ వివరాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది గమనించాలి.
5. ఎక్కువ ధర ఉన్న స్టీల్ గిన్నె నాణ్యమైనదా?
అలా ఏమీ లేదు. ధర కంటే క్వాలిటీ సర్టిఫికేట్, తయారీదారు వివరాలు, లోహం నాణ్యత, గిన్నె తయారీ, ఫినిషింగ్ నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలి.