
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మన మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు కారణమవుతుంది. అదనపు కొలెస్ట్రాల్ ధమనుల గోడలలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది.
లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మీ శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ ను గుర్తించొచ్చు. ఒకవేళ మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ కరిగేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. నిజానికి మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్. వీటిలో HDL మంచి కొలెస్ట్రాల్ (అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను లేదా ఎల్డిఎల్ (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ను తొలగించడానికి సహాయపడుతుంది.
అయితే కొన్ని రకాల మసాలా దినుసులు అధిక కొలెస్ట్రాల్ ను కొంతవరకు తగ్గించడానికి సహాయపడతాయి. మసాలా దినుసులు యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని దెబ్బతినకుండా రక్షిస్తాయి. మన ఆహారంలో మసాలా దినుసులను జోడించడం వల్ల శరీరానికి సరైన పోషణ అందడమే కాదు అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోతే.. గుండె జబ్బుల బారిన పడొచ్చు. మన వంటింట్లో ఉండే కొన్ని ముఖ్యమైన మసాలా దినుసులను జోడించడం వల్ల కొలెస్ట్రాల్ ను కొంతవరకు నియంత్రించుకోవచ్చుంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు
పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పురాతన ఆయుర్వేద మసాలా దినుసు. దీనిలో కర్కుమిన్ అని పిలువబడే క్రియాశీల సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీర్ఘకాలిక తాపజనక ఊపిరితిత్తుల వ్యాధులు, ప్యాంక్రియాటైటిస్, పేగు సమస్యలు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడంలో పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క గుండెకు సంబంధిత రుగ్మతలను నయం చేయడానికి అద్భుతమైన పనిచేసే మసాలా దినుసుగా ప్రసిద్ధి చెందింది. ఇది అంతర్గత అడ్డంకుల నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సహజ ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. దాల్చిన చెక్కను టీ తో పాటుగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు.
మిరపకాయ
మిరపకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మెంతులు
మెంతుల్లో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రించే ప్రధాన సుగంధ ద్రవ్యాలలో మెంతులు ఒకటి. ఇది గట్, కాలేయంలోని కొలెస్ట్రాల్ శోషణను నెమ్మదింపజేసే సమ్మేళనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవాలనుకునే వారికి మెంతులు మంచి మెడిసిన్ లా ఉపయోగపడతాయి.
సోంపు గింజలు
సోంపు గింజలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. సోంపు గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.