చలికాలంలో మీ ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

First Published Jan 17, 2023, 4:05 PM IST

చలికాలంలో కీళ్లు, ఎముకల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. 
 

ఎండాకాలం మొదలుకాబోతున్నా.. చలి మాత్రం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఉదయం,  రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గుతున్నాయి. ఈ చల్లని వాతావరణం వల్ల దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి సమస్యలతో పాటుగా ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. చలికాలంలో పెరిగిన కీళ్ల నొప్పులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ళలో పెరిగిన మంట కారణంగా వస్తాయి. శరీరంలోని పరిధీయ ప్రాంతాలకు రక్త సరఫరా తక్కువగా ఉండటం వల్ల కీళ్లు బిగుసుకుపోయి కీళ్లు, ఎముకల్లో నొప్పి వస్తుంది.

శీతాకాలంలో కీళ్ల నొప్పులు సర్వ సాధారణం. ముఖ్యంగా ఆర్థరైటిస్ పేషెంట్లకు ఇది భరించలేని నొప్పిని కలిగిస్తుంది. నిజానికి ఈ నొప్పుల వల్ల నడవటానికి, కూర్చోవడానికి చాలా ఇబ్బందికలుగుతుంది. రోజు వారి పనులను చేసుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. మరి ఈ కీళ్ల నొప్పిని తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చలికాలంలో కీళ్ల నొప్పులు సాధారణం. ఎందుకంటే చల్లని వాతావరణం వేళ్లు, కాళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కండరాలు బిగుతుగా మారతాయి. ఫలితంగా దృఢత్వం, నొప్పి వస్తుంది. అంతేకాకుండా చలికాలంలో చాలా మంది ఇండ్లల్లోనే ఉంటారు. దీనివల్ల వీరికి సూర్యరశ్మి సరిగ్గా తగలదు. ఇది విటమిన్ డి లోపానికి దారితీస్తుంది. దీనివల్ల కూడా ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.

పుష్కలంగా నీటిని తాగాలి

మన శరీరానికి నీరు అవసరం కాదు అత్యవసరం. నీటితోనే మనం తిన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలాగే శరీరంలో విషపదార్థాలు బయటకు పోతాయి. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, మంటను తగ్గించడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే రోజుకు 8 గ్లాసుల నీటినైనా తాగండి. నీరు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

స్వెట్టర్లు

చలికారణంగా కాళ్లు, చేతులు మరీ చల్లగా అవుతాయి. అంతేకాదు వీటికి రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఈ కారణంగా కీళ్ల నొప్పుల, ఎముక నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకే ఈ సీజన్లో మనల్ని వేడిగా ఉంచే స్వెట్టర్లను, వేడి వేడి దుస్తులను వేసుకోండి. ఇంట్లో, పని ప్రదేశాల్లో మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోండి. 
 

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉంటుంది. బీపీ, బ్లడ్  షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే గుండె ఫిట్ గా ఉంటుంది. అంతేకాదు కీళ్ళ ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు వ్యాయామం కీళ్ళ కందెనకు, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. దీంతో కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.
 

సూర్య రశ్మి

ప్రతిరోజూ అర్థగంటైనా సూర్యరశ్మిలో తప్పకుండా ఉండాలి. ఎందుకంటే సూర్యరశ్మి ద్వారా మన  శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. ఈ విటమిన్ డి ఎముకలను నిర్మించడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

విటమిన్ డి, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అల్లం, సోయాబీన్, కొవ్వు చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, విత్తనాలను పుష్కలంగా తీసుకోండి. అలాగే  పుష్కలంగా నీటిని తాగండి. ఇతర కొల్లాజెన్ సప్లిమెంట్లను కూడా తీసుకోండి. అలాగే సమతుల్య ఆహారం తీసుకుంటే చలకాలంలో వచ్చే కీళ్ల, ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. 

శారీరక శ్రమ

నిజానికి శారీరక శ్రమ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎటూ కదలకుండా ఒకే దగ్గర కూర్చున వారికి హై బీపీ నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి కూడా. శరీరంలో క్రమం తప్పకుండా కదలికలు ఉంటే మీ కీళ్ళలో నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 
 

బరువును తగ్గించుకోవాలి

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల ఎముకలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందుకే అధిక బరువు ఉన్నవారికి ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బరువును మెయింటైన్ చేయాలి.

click me!